మరోసారి ఎన్నుకున్నారో ద్రోహమే...

21:08 - August 10, 2018

పశ్చిమగోదావరి : వచ్చే ఎన్నికల్లో టీడీపీని మరోసారి ఎన్నుకుంటే రాష్ట్రానికి జరిగేది ద్రోహమేని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హెచ్చరించారు. టీడీపీని మరోసారి గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడాన్ని జనసేనాని తప్పుపట్టారు. అధికారంలో ఉండగా ఏం చేశారని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పోరాట యాత్రలో పవన్‌ ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పోరాట యాత్ర నిర్వహించారు. జనసేనాని సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పవన్‌ విమర్శల వర్షం కురించారు.

టీడీపీని మరోసారి ఎన్నుకుంటే రాష్ట్రానికి అధోగతి తప్పదని జనసేనాని హెచ్చరించారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని కుయుక్తులైనా పన్నుతారని పవన్‌ మండిపడ్డారు. రాష్ట్రానికి మేలు చేస్తారని గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీని బలపరిస్తే.. చివరికి అన్యాయమే జరిగిందని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ నేతల వైఖరి ఏరుదాటిన తర్వాత తెప్పతగలేసిన చందంగా ఉందని పవన్‌ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌ కాపులు, బీసీలకు ద్రోహం చేశారని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. సామాజిక న్యాయం, రాజకీయ మార్పు, అవినీతి ప్రక్షాళన కోసమే జనసేన ఆవిర్భవించిందని పవన్‌ చెప్పారు. 

Don't Miss