జేఏసీ ఏర్పాటు పవన్ సన్నాహలు

21:46 - February 8, 2018

హైదరాబాద్ : ఏపీలో జేఏసీ ఏర్పాటుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రయత్నాలు మొదలుపెట్టారు. విభజన హామీలు సాధించడానికి తనశక్తి సరిపోదని.. అందుకు జేఏసీ ఏర్పాటు చేస్తామని బుధవారం ప్రకటించారు. జేఏసీ ఏర్పాటు ప్రకటించిన 24 గంటల్లోపే తన ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా ప్రకటించినట్టు లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణను కలిశారు. బేగంపేట్‌లోని ఆయన కార్యాలయంలో జేపీతో భేటీ అయ్యారు. కలసి పనిచేయడంపై ఇద్దరూ చర్చించుకున్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అందరం కూర్చొని వేదిక ఏర్పాటు చేయాలన్న పవన్‌ ఆలోచనకు తాను మద్దతిస్తున్నట్టు జయప్రకాశ్‌ నారాయణ తెలిపారు. ఒక గంటలో సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఎవరికీ లేదన్నారు. ప్రజలకు కావాలసినవి రావాలంటే అందరూ సమష్టిగా పోరాడాలన్నారు. ఒకసారి చట్టంలో పెట్టాక ఆశలు, ఆకాంక్షలు అమలు చేయకపోవడం.. ఏరు దాటాక తెప్ప తగలేయడమేనన్నారు. ఇప్పుడు కేంద్రం అదే చేస్తోందన్నారు. ఏపీతో పాటు తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని... ఆర్థికంగా జరగవలసిన హామీలు కచ్చితంగా అమలు చేయాలన్నారు.

రెండు రాష్ట్రాల నాయకులు
విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హామీల సాధనకు జేఏసీని ఏర్పాటు చేస్తామని... అందుకు సహకరించాలని జేపీని కోరానన్నారు. జేఏసీలో రెండు రాష్ట్రాల నాయకులను భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. కేంద్రంపై ఒక సమూహంగా పోరాడాల్సిన అవసరం ఉందని...అఖిలపక్ష భేటీ తర్వాత ప్రధానమంత్రిని కలిసి అన్నీ వివరించనున్నట్టు పవన్‌ స్పష్టం చేశారు.మొత్తానికి పవన్‌ కల్యాణ్‌ .. జేపీని కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పవన్‌ ప్రయత్నాలు ఏమేరకు సక్సెస్‌ అవుతాయన్న చర్చ నడుస్తోంది.

Don't Miss