బాధితులకు అండగా జనసేనాని...

18:04 - January 3, 2017

శ్రీకాకుళం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఉద్దానం కిడ్నీ బాధితుల పక్షాన గళం విప్పారు.  వ్యాధిగ్రస్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన బాధితుల సమస్యపై ఏపీ ప్రభుత్వం 48 గంటల్లో స్పందించాలని డెడ్‌లైన్‌ విధించారు. సమస్య పరిష్కార దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. 
కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పవన్ ముఖాముఖి 
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్దానం సమస్యలపై ఏపీ సర్కార్‌ 48 గంటల్లోగా స్పందించాలని డెడ్‌లైన్‌ విధించారు. సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. బాధితులతో స్వయంగా ముఖాముఖి నిర్వహించి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా కిడ్నీ వ్యాధితో తాము బాధపడుతున్నా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఉద్దానం బాధితులు అన్నారు. పవన్‌కల్యాణ్ తమ సమస్య గురించి రావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. పవన కల్యాణ్ తమను ఆదుకోవాలని కోరారు. 
ఉద్దానం సమస్య ఒక విపత్తన్న పవన్‌ ..
ఉద్దానం సమస్య ఒక విపత్తన్న పవన్‌ .. ప్రజలు కిడ్నీ వ్యాధులతో చనిపోతున్నా..ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. ఉద్దానం సమస్య పరిష్కారం కోసం 100 కోట్లు కేటాయించాలని, తొలుత జబ్బును గుర్తించేందుకు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. పుష్కరాలకు వందల కోట్లు .. రాజధానికి వేల కోట్లు ఖర్చు పెట్టే పాలక నేతలు... మనుషులు చనిపోతే మాత్రం నిధులు ఖర్చు పెట్టరా అని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు.  
ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఖండించిన పవన్‌   
విభజన సమయంలో కిడ్నీ వ్యాధి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లకపోవటం.. సమస్యను ప్రస్తావించకపోవటాన్ని పవన్‌కల్యాణ్‌ తప్పు పట్టారు. దీనిపట్ల ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని పవన్‌ తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉద్దానం ప్రాంతంలోని సమస్యలపై ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక తయారు చేస్తుందని.. దాన్ని తానే స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఈ సమస్య పరిష్కారం కోసం అవసరమైతే ప్రజాప్రతినిధుల వద్దకు తానే స్వయంగా వెళ్తానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కిడ్నీ వ్యాధి సమస్యపై పదిహేను రోజుల్లో కమిటీ తన నివేదిక ఇస్తోందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కమిటీ రిపోర్ట్‌ తర్వాత అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని పవన్‌ బాధితులకు హామీ ఇచ్చారు. 

Don't Miss