కార్పొరేట్ 'క్షవరం'..

10:13 - December 23, 2016

ఇప్పటికే కార్పొరేట్‌ సంస్థల నుంచి తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటున్న సంప్రదాయ క్షౌరవృత్తిదారుల నోట్ల రద్దు తర్వాత మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. డిజిటల్‌ యుగంలో అత్యధికంగా ప్రభావితమయ్యే వృత్తుల్లో క్షౌరవృత్తి కూడా వుండబోతోంది. సొంతంగా చిన్నచిన్న సెలూన్‌ లు నడుపుకుంటున్నవారి భవిష్యత్‌ ఏమవుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

క్షౌరవృత్తిలో మార్పులు..2020 నాటికి లక్ష కోట్ల టర్నోవర్
క్షవరం... క్షురకులకు ఇది జీవనాధారం. మన తెలుగు రాష్ట్రాల్లో పాతిక నుంచి 30 లక్షల మంది జీవితాలు ఈ వృత్తితో అనుసంధానమై వున్నాయి. అత్యంత ప్రాచీన వృత్తి. చేతిలో చిన్న సంచి, అందులో ఒక కత్తెర, చిన్న చాకు, దానిని సానపెట్టేందుకు చిన్నరాయి, ఒకట్రెండు దువ్వెనలు ఇవి వుంటే చాలు ఈ వృత్తి సాఫీగా సాగిపోయేది. ఇప్పుడు కాలం మారింది. ప్రతి వృత్తి హైటెక్ సొగసులు అద్దుకుంటోంది. క్షౌరవృత్తిలోనూ మన కళ్లెదుటే చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడు మరిన్ని మార్పులు రాబోతున్నాయి. నోట్ల రద్దు, డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ ఈ వృత్తిని తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నాయి. బహుశా, ఇప్పుడున్న స్వతంత్రత క్షురకులకు ఇక భవిష్యత్తులో ఉండకపోవచ్చు.

వ్యాపారంగా మారిపోయిన హెయిర్ అండ్ బ్యూటీ పార్లర్
హెయిర్ అండ్ బ్యూటీ పార్లర్ ఇప్పుడో ఆకర్షణీయ వ్యాపారంగా మారిపోయింది. హెయిర్ అండ్ బ్యూటీ కేర్ పేరుతో క్షౌరానికి గ్లామర్ సొగసులు అద్దిన పది పన్నెండు పెద్ద సంస్థలు ఇప్పుడు ఈ వ్రుత్తిని శాసిస్తున్నాయి. విదేశీ బహుళజాతి సంస్థలు వేల సంఖ్యలో హెయిర్ సెలూన్ లు నడుపుతున్నాయి. కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ వ్యాపారం ప్రతి ఏటా 20 నుంచి పాతిక శాతం వ్రుద్ధిని సాధిస్తోంది. 2020 నాటికి ఇది లక్ష కోట్ల టర్నోవర్ వున్న వ్యాపారంగా మారుతుందన్నది బహుళజాతి సంస్థల అంచనా. అందుకే నగరాలు, మహానగరాలతో పాటు ఇప్పుడు పెద్ద పట్టణాల్లో సైతం ఈ రంగంలో కార్పొరేట్ సంస్థల బ్రాంచీలు వెలుస్తున్నాయి. మన దేశంలో నాలుగైదు వేల బ్రాంచీలు నిర్వహిస్తున్న బడా సంస్థలు సైతం వున్నాయి.

హెయిర్ అండ్ బ్యూటీ కేర్ లో కార్పొరేట్ సంస్థలు
హెయిర్ అండ్ బ్యూటీ పార్లర్ మార్కెట్ ను చేజిక్కించుకునేందుకు కార్పొరేట్ సంస్థలు పోటీ పడుతున్న తీరు స్వతంత్రంగా, సంప్రదాయబద్దంగా వృత్తి నిర్వహించే క్షురకుల ఉపాధి అవకాశాలను ఘోరంగా దెబ్బతీస్తోంది. నగరాలు పట్టణాల్లో సెలూన్ అద్దెలు పెరిగిపోతున్నాయి. భారీగా అడ్వాన్స్ లు చెల్లించాల్సి వస్తోంది. యాభై వేల నుంచి మూడు లక్షల దాకా అడ్వాన్ లు కట్టాల్సి వస్తోంది. నగరాలు, పట్టణాల్లో కనీసం పది లక్షల రూపాయలు పెట్టకుండా ఒక మోస్తారు సెలూన్ ప్రారంభించలేని పరిస్థితిని క్షురకులు ఎదుర్కొంటున్నారు. హెయిర్ అండ్ బ్యూటీ పార్లర్ బిజినెస్ లోకి కార్పొరేట్ సంస్థలు ప్రవేశించడంతో తరతరాలుగా క్షౌర వ్రుత్తినే నమ్ముకున్న కొన్ని లక్షల కుటుంబాలు పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

పెరుగుతున్న సెలూన్ అద్దెలు.. సంక్షోభంలో క్షురకుల కుటుంబాలు
కార్పొరేట్ సంస్థలకు ధీటుగా సెలూన్ లు పెట్టుకునే ఆర్థిక స్థోమతలేక , సెలూన్ల అద్దెలు, కరెంట్ బిల్లులు చెల్లించలేక విలవిలాడుతున్న పరిస్థితి. నోట్ల రద్దు, కరెన్సీ కరెత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ కి ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో క్షురకులు ఎదుర్కొంటున్న సమస్యలను సహృదయంతో అర్ధం చేసుకుని, కార్పొరేట్ సంస్థల ధాటి నుంచి వారిని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోకపోతే, వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. 

Don't Miss