టెక్స్‌టైల్‌ రంగంపై పెద్ద నోట్ రద్దు తీవ్ర ప్రభావం

10:30 - December 16, 2016

నోట్ల రద్దు టెక్స్ టైల్ రంగానికి పెనుశాపంగా మారుతోంది.  వ్యాపారాలు పడిపోవడంతో వస్త్ర వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.  మరో నెల రోజుల్లో సంక్రాంతి పండుగ వున్నా కొత్త స్టాక్ తెచ్చుకోలేని స్థితిలో వస్త్ర వ్యాపారులు చిక్కుకున్నారు. టైలర్స్, ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసేవారు, శారీ ఫాల్స్ కుట్టేవారు, చేతిపనిచేసేవారు ఇలా అనేకమంది ఉపాధికి గండికొట్టింది నోట్ల రద్దు వ్యవహారం.
పెద్ద నోట్ల రద్దుతో కష్టాలు
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో టెక్స్ టైల్ రంగానిది కీలకపాత్ర. మన దేశ జీడీపీలో టెక్స్ టైల్ రంగం వాటా 5శాతం దాకా వుంది.  టెక్స్ టైల్ ఇండస్ట్రీలో ప్రపంచంలోనే మనది రెండో స్థానం. మన దేశ ఎగుమతుల్లో 11శాతం టెక్స్ టైల్ రంగం నుంచే వుండడం విశేషం.  ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నాలుగు నుంచి ఆరు కోట్ల మంది ఈ రంగం మీద ఆధారపడి వున్నారు. ఇప్పుడు వీరి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతోంది. రాబోయే రోజులు ఎలా వుంటాయోనన్న ఆందోళన వీరిని చుట్టుముట్టింది. ఈ ఆదుర్ధానికి కారణం నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం. నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన మరుక్షణం నుంచి తీవ్రంగా ప్రభావితమవుతున్న రంగాలలో టెక్స్ టైల్ రంగం  కూడా వుంది.  ఒక్కసారిగా కరెన్సీ సమస్య తలెత్తడంతో వస్త్ర దుకాణాల్లో అమ్మకాలు పడిపోయాయి.  చీరలు, బ్లౌజ్ పీస్ లు, చుడీదార్ లు, ధోవతిలు, లుంగీలు, ప్యాంట్లు, షర్టులు, చివరకు చిన్న పిల్లల దుస్తుల అమ్మకాలు కూడా పడిపోయినట్టు వస్త్రదుకాణాల వారు చెబుతున్నారు. 
పడిపోయిన బట్టల అమ్మకాలు  
బట్టల అమ్మకాలు పడిపోవడంతో దాని ప్రభావం దర్జీల మీద, ఎంబ్రాయిడరీ వర్కర్స్ మీద కూడా పడుతోంది. చివరకు చీరలకు పాల్స్, బ్లౌజ్ లు కుట్టే పని కూడా దొరకడం లేదంటూ ఈరంగంలోని మహిళలు ఆవేదన చెందుతున్న దృశ్యమే దేశమంతటా కనిపిస్తోంది. వస్త్రాల అమ్మకాలు పడిపోవడంతో సహజంగానే బట్టల మిల్లుల్లో ఉత్పత్తి తగ్గిస్తున్నారు.  చాలామంది వస్త్రాల తయారీని సగానికి సగం తగ్గించారు. దీంతో వర్కర్లకు వారంలో రెండు మూడు రోజులకు మించి పని దొరకడం లేదు.  టెక్స్ టైల్ రంగంలో అత్యధిక శాతం క్యాష్ బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు క్యాష్ కు కొరత రావడంతో యావత్ పరిశ్రమ ఉక్కిరిబిక్కరవుతోంది.  చివరకు దీని ప్రభావం పత్తి సాగే రైతుల మీద కూడా పడుతోంది. వస్త్రాల వ్యాపారం పడిపోవడం, గిరాకీ తగ్గడం, కరెన్సీ అందుబాటులో లేకపోవడంతో పత్తి కొనుగోళ్లు కూడా తగ్గిపోయాయి.  వస్త్ర వ్యాపారం పడిపోవడంతో తమ దగ్గర పనిచేసే వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎదురవుతోందన్న  ఆందోళన వస్త్ర వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. షాపు కిరాయి, కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో పలువురు వస్త్ర వ్యాపారులు చిక్కుకున్నారు. ఇది పండుగల సీజన్.  మరో పది రోజుల్లో క్రిస్మస్, ఆ తర్వాత సంక్రాంతి పండుగలున్నాయి. . ఇంటిల్లిపాదీ కొత్త బట్టలు కొనుక్కునే పండుగలివి. కొత్త మోడల్స్, కొత్త వెరైటీల కోసం కొనుగోలుదారులు వెదుకుతుంటారు. కానీ, వ్యాపారాలు పడిపోవడంతో కొత్త స్టాక్ తీసుకురాలేని పరిస్థితి ఎదురైందంటున్నారు వస్త్ర వ్యాపారులు. 

Don't Miss