తెలంగాణలో జనసేనాని తొలి అడుగు

21:59 - January 22, 2018

హైదరాబాద్ : తెలంగాణలో జనసేనాని తొలి అడుగు పడింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పోటీచేస్తామని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే తెలంగాణలో పర్యటిస్తున్నానన్న ఆయన.. ప్రభుత్వాలతో గొడవలు పెట్టుకునే ఉద్దేశం తనకు లేదన్నారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పవన్‌.. ఈ నెల 27 నుంచి అనంతపురం జిల్లాలో పర్యటిస్తానన్నారు. 
ప్రజా యాత్రను ప్రారంభం
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తన ప్రజా యాత్రను ప్రారంభించారు. ఉదయం తన నివాసం నుంచి ప్రశాసన్‌నగర్‌లోని జనసేన కార్యాలయానికి చేరుకున్న పవన్‌కు కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. భార్య లెజినోవా ఆయనకు హారతి ఇచ్చారు. అనంతరం పవన్‌ కారులో జగిత్యాల జిల్లా కొండగట్టుకు బయలుదేరారు. ఆ సమయంలో పవన్‌కు మద్దతుగా జనసేన కార్యకర్తలు పెద్దయెత్తున నినాదాలు చేశారు. పవన్‌ వెంట పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు సుమారు 50 వాహనాల్లో బయలుదేరారు.
ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్న పవన్‌ 
కొండగట్టులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆంజనేయ స్వామి ఆలయాన్ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దర్శించుకున్నారు. అక్కడ పవన్‌కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం పవన్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అంజనేయ స్వామికి పవన్‌ ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి పవన్‌కల్యాణ్‌ 11లక్షల రూపాయల విరాళం ఇచ్చారు.  
కరీంనగర్‌ చేరుకున్న పవన్‌ 
ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం పవన్‌ కల్యాణ్‌ కరీంనగర్‌ చేరుకున్నారు. అక్కడ మీడియా సమావేశంలో పాల్గొన్న పవన్‌ ప్రభుత్వాలతో గొడవలు పెట్టుకునే ఉద్దేశమేదీ తనకు లేదన్నారు. నిర్మాణాత్మక రాజకీయాలు మాత్రమే తాను చేస్తానని చెప్పారు. కార్యకర్తలతో ఆలోచించి ఏయే సమస్యలపై ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చిస్తామని పవన్‌ చెప్పారు.
ఈ నెల 27 నుంచి అనంతపురం జిల్లాలో పర్యటిస్తా : పవన్  
ఈ నెల 27 నుంచి అనంతపురం జిల్లాలో తన పర్యటన ప్రారంభమవుతుందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. జిల్లాలో రెండు మూడు రోజులు పర్యటన ఉంటుందన్నారు. ఆ తర్వాత ఒంగోలులో ఫ్లోరోసిస్‌, కిడ్నీ బాధితులను కలుస్తామన్నారు. అనంతరం విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం బాధితులను కలుస్తానన్నారు పవన్‌. 
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గౌరవించాలి : పవన్ 
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గౌరవించాల్సిన అవసరం ఉందని, రాజకీయ అస్థిరత కోసం తానెప్పుడూ మాట్లాడనని పవన్‌ అన్నారు. గొడవలతో సమస్యలు పరిష్కారం కావని.. గొడవలతో ప్రజలకు ఇబ్బందులు కలిగే పని తాను చేయనని పవన్‌ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీ సంస్థాగతంగా నిర్మాణ దశలో ఉందని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. 
ఓటుకు నోటుపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. 
ఓటుకు నోటుపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. అది తప్పని తనకూ తెలుసన్నారు. ఇండియన్‌ పొలిటికల్‌ ప్రాసెస్‌లో అన్ని పార్టీలు ఇలాంటి పనులు చేస్తున్నాయన్న ఆయన.. దీనిపై గొడవ పెట్టుకుని అస్థిరత సృష్టించడం ఇష్టం లేకే మాట్లాడలేదన్నారు.
రేపు జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం  
ఇక పవన్‌ కల్యాణ్‌ మంగళవారం కరీంనగర్‌ జిల్లా జగిత్యాల రోడ్‌లోని శుభం గార్డెన్స్‌లో 10 గంటల 45 నిమిషాలకు ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల జనసేన కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం భోజనం అనంతరం కొత్తగూడెం బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు కొత్తగూడెం చేరుకొని అక్కడే బస చేస్తారు. 24న ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కొత్తగూడెం నుంచి ప్రదర్శనగా బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 3 గంటలకు ఖమ్మంలోని ఎంబీ గార్డెన్స్‌లో జరిగే ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. తర్వాత హైదరాబాద్‌కు పయనమవుతారు.

 

Don't Miss