పోలవరంపై 'పవన్' స్పందన ఇది...

12:18 - December 7, 2017

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పోలవరం నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించి జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు.

పోలవరంపై తనకు సరియైన అవగాహన లేదని..తెలుసుకోవాలనే ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఏ ఒక్క ప్రభుత్వానిదో..ఏ ఒక్క పార్టీదో కాదని..ప్రజలదన్నారు. ప్రాజెక్టు వల్ల ఎంత లాభం..ఎంత నష్టం అన్నది పరిశీలించాలని, నిర్మాణంలో అడ్డంకులు పడుతున్నాయన్నారు. నిర్మాణం జాప్యం జరిగే కొద్ది వ్యయం విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉందని, 2018 నాటికి పూర్తవుతుందని ప్రభుత్వం చెప్పడం కరెక్టు కాదన్నారు. ఇలాంటి మాటలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టవద్దని, ఎన్నికల రాజకీయాలు చేయవద్దని సూచించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో పారదర్శకంగా ఉన్నామని చెబుతున్న ప్రభుత్వం ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న నిధులు..ఇతరత్రా లెక్కలు తెలియచేయాలని, అవకతవకలు జరగలేదని చెబుతున్న ప్రభుత్వం అందుకనుగుణంగా ప్రకటన చేయాలన్నారు. పోలవరం పునరావాస కార్యక్రమాలు సక్రమంగా జరగాలని పవన్ సూచించారు. 

Don't Miss