పవన్ వెనక ఉన్నది ఎవరు..?

18:42 - February 14, 2018

హైదరాబాద్ : మొన్నటి వరకూ మీడియా సమావేశంలోనో.. సోషల్ మీడియా ద్వారానో తన స్పందన తెలిపిన జనసేనాని పవన్ కల్యాణ్ కొద్దిరోజులుగా పంథాను మార్చుకున్నారు. ముఖ్యంగా ఏపీ విభజన హామీల సాధన కోసం కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఒంటరిపోరుతో కేంద్రాన్ని కదిలించలేమని భావించారో ఏమో... విభజన హామీల లెక్కలు తేల్చేందుకు జేఎఫ్ఎఫ్‌సీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానంటూ పార్టీ పెట్టిన పవన్ తెలుగు రాష్ట్రాల్లో పలుమార్లు సుడిగాలి పర్యటనలు చేశారు. స్ధానిక సమస్యల పరిష్కారం పోరాటం చేశారు.

కొండగట్టు నుంచి తన రాజకీయ యాత్ర
రాజధాని నిర్మాణం కోసం ఏపీ సర్కార్ బలవంతపు భూసేకరణ చేపట్టినపుడు తుళ్లూరు రైతులకు బాసటగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్ని బాధితుల సమస్యలపై గ‌ళ‌మెత్తారు..ఆత‌రువాత మంగ‌ళ‌గిరి చేనేత కార్మికుల స‌మ‌స్యలపై స‌భను పెట్టి వారి సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేశారు. ఓవైపు సమస్యలపై స్పందిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ బిజీ బిజీగా గడిపారు. అటు తరువాత కొంతకాలం ట్విట్టర్ వేదికగా ట్వీట్స్‌కి పరిమితం అయ్యారు. 2014 ఎన్నిక‌ల త‌రువాత అడపా దడపా జనంలోకి వచ్చిన పవన్ ఉన్నపళంగా అజ్ఞాతవాసం వీడారు. ఇకపై పూర్తిగా యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉంటానని .. ఇక సినిమాలకు గుడ్‌ బై చెప్పేసినట్లేనని చెప్పుకొచ్చారు. కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభిస్తున్నానని ప్రకటించిన పవన్ ఇటు తెలంగాణ.. అటు ఏపీల్లో పర్యటించి రైతులు.. విద్యార్ధులు.. నిరుద్యోగులతో పలు సమస్యలపై చర్చలు కూడా జరిపారు. తాజాగా ఏపీ విభజన హామీల సాధన దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టిన పవన్ ఉండవల్లితో భేటీ అయ్యారు. విభజన హామీలు సాధన కోసం జే.ఎఫ్.ఎఫ్.సీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయడమే కాకుండా దాని బాధ్యతలను రాజకీయాల్లో తలపండిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు అప్పగించారు.

రాజకీయ విశ్లేషకులు పలు అనుమానాలు
తాజాగా పవన్ తీరుపై రాజకీయ విశ్లేషకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ జేఏసీ ఏర్పాటు వెనుక ఓ కీలక వ్యక్తి ఉన్నారని భావిస్తున్నారు. భవిష్యత్‌ రాజకీయాల్ని దృష్టిలో పెట్టుకుని ఇటు రాష్ట్రంతో పాటు.. అటు కేంద్రాన్ని విభజన హామీల చిట్టాతో పవన్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే పవన్ తాజా నిర్ణయాల వెనుక కర్త..కర్మ..క్రియ ఎవరన్నది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. 

Don't Miss