సామాజికంగా మార్పు తేవడమే రాజకీయం : పవన్ కళ్యాణ్

16:22 - December 7, 2017

రాజమండ్రి : సీఎం కావడమే రాజకీయ మార్పు కాదని...సామాజికంగా మార్పు తేవడమే రాజకీయమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఉభయగోదారి జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై, మాట్లాడారు. ప్రకృతి వనరులను అందరికీ సమానంగా పంచడమే రాజకీయమని వివరించారు. విధివిధానాలు లేకుండా రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన చిరంజీవికి ఉండేదని తెలిపారు. అయితే చిరంజీవి చుట్టూ నిస్వార్థపరులు లేకపోవడం వల్లే ప్రజారాజ్యం పార్టీ కూలిపోయిందన్నారు. సినిమాలు చేయడం తన వృత్తి అని.... రాజకీయం తన ప్రవృత్తి 
అని తెలిపారు. ట్విట్టర్ లోనే స్పందిస్తున్నానని..కొంతమంది తనపై విమర్శిస్తున్నారని..ఈరోజు నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటానని చెప్పారు. దేనికైనా అనుభవం కావాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు భూతులు తిట్టుకుంటూ, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసుకుంటున్నారని..అది సరికాదన్నారు. ఒక రాజకీయ పార్టీపై మరో పార్టీ వెటకారం, వ్యంగ్యపూరితంగా మాట్లాడుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు.. ఏంటో ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా తెలియదన్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వస్తున్న నిధులను మాత్రం కాజేస్తున్నారని ఆరోపించారు. పరకాల ప్రభాకర్... చిరంజీవిని విమర్శించిన నాడు తాను పరకాల పక్కల ఉంటే పరిస్థితి వేరే ఉండేదన్నారు. చిరంజీవిపై విమర్శలు చేసిన పరకాల ప్రభాకర్...స్పెషల్ క్యాటగిరీ విషయంలో ఆయన సతీమణి నిర్మలా సీతారామన్ తో ఎందుకు మాట్లాడడం లేదని, మోడీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. చిరంజీవికి ఒక న్యాయం మోడీకి మరో న్యాయం అంటే కుదరదని చెప్పారు. 

 

Don't Miss