ఉత్తరాంధ్ర అభివృద్ధి టీడీపీ పాలకులకు పట్టదా ? పవన్‌ కల్యాణ్‌

07:45 - June 1, 2018

విజయనగరం : ధర్మపోరాటం, నవ నిర్మాణ దీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాధనాన్ని మంచినీటి ప్రాయంగా ఖర్చు చేస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా సాధనలో విఫలమైన చంద్రబాబు.. దేనికోసం దీక్షలు చేస్తున్నారో చెప్పాలని జనసేనాని డిమాండ్‌ చేశారు. ప్రజాధనానికి ధర్మకర్తగా ఉండాల్సిన ముఖ్యమంత్రి... దీక్షల పేరుతో దుర్వినియోగం చేయడం ఏంటని... విజయనగరం జిల్లా పార్వతీపురం జనసేన పోరాట యాత్రలో చంద్రబాబును ప్రశ్నించారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజా పోరాట యాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీల్లో జనసేనాని పాల్గొన్నారు. రెండు సభలకు భారీగా జనం తరలివచ్చారు. ప్రత్యేక హోదా సాధనలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇప్పుడు ధర్మపోరాటం, నవనిర్మాణ దీక్షలంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పవన్‌ ఆరోపించారు. 

పవన్‌ కల్యాణ్‌.. ఎవరో తెలియదంటూ విజయనగరం టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు చేసిన వ్యాఖ్యలపై జనసేనాని తీవ్రంగా స్పదించారు. 2014 ఎన్నికల్లో జనసేన ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు.. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో జనసేనను గెలిపిస్తే బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఇస్తుందని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. 

పెద్దనోట్లు రద్దు చేయాలని ప్రధాని మోదీకి తానే సలహా ఇచ్చానని ప్రచారం చేసుకొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు... పెట్రోలు, డీజిల్‌కు జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని ఎందుకు చెప్పడంలేదని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తుందని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. అభివృద్ధి ప్రణాళికల అమలును పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

Don't Miss