'మహా' తరహాలో పోరాటమన్న పవన్...

20:25 - July 28, 2018

విజయవాడ : అడ్డగోలుగా భూసేకరణ చేస్తే మహారాష్ట్ర తరహాలో పోరాటం చేస్తామని... ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిని ముట్టడించి ఆందోళన చేస్తామని పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. లక్ష మంది రైతులకు సంబంధించిన అంశాలపై పోరాడాల్సిన సమయం వచ్చిందని విజయవాడలో.. '2013 భూ సేకరణ చట్టం - పరిరక్షణ' పేరిట జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇష్టమొచ్చినట్లు.. అవసరానికి మించి భూసేకరణ చేస్తున్నారన్నారు. దీనిపై రైతులతో కలిసి ఆందోళన చేస్తామని... అన్ని జిల్లాల నుంచి వచ్చే రైతులతో సీఎం ఇంటి వద్ద ఆందోళన చేస్తామన్నారు. ఇష్టారాజ్యం దోపిడీ చేయడానికి ఇది సీఎం సొంత రాజ్యం కాదని పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు.

అడ్డగోలుగా భూసేకరణ చేస్తే మహారాష్ట్ర తరహాలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం శ్రీకాకుళం, అనంతపురం నుంచి ఉప్పెనలా వస్తామన్నారు. ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడానికి సీఎం సొంత రాజ్యం కాదన్నారు.

తన సభలకు భద్రత కుదరదని చెప్పే పోలీసులపై తనకెలాంటి వ్యతిరేకతా లేదన్నారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వారు అలా వ్యవహరించి ఉంటారని అభిప్రాయపడ్డారు. భీమవరంలో ఇప్పటివరకు చెత్త డంపింగ్‌ యార్డు లేదన్న పవన్‌.. బాధ్యతాయుతమైన అభివృద్ధి చేయాలని అన్నారు. ప్రజల కోసం తాను చావడానికి సిద్ధమని, పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. కలుషితమైన రాజకీయాలను మార్చడానికే వచ్చానన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కన్నీటి కథలే వినబడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రశ్నించేవారిని భయపెడుతున్నారన్నారు. ఈ సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ సీఎస్‌ ఐవైఆర్ కృష్ణారావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Don't Miss