జనతా గ్యారేజ్ రివ్యూ....

16:19 - September 1, 2016

యంగ్ టైగర్ 'యన్టీఆర్' నటించిన లేటెస్ట్ మూవీ 'జనతా గ్యారేజ్'. 'మిర్చి', 'శ్రీమంతుడు' సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన 'కొరటాల శివ' మలిచిన మరో సందేశాత్మక చిత్రం ఇది. మరి ఈ సినిమాతో 'యన్టీఆర్' 'కొరటాల' సందేశాన్ని ఎంతవరకు క్యారీ చేసాడో తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే.

లేని పంచ్ డైలాగ్స్..
సందేశాన్ని సినిమాగా చెప్పాలంటే వినోదం అవసరం లేదని 'కొరటాల శివ' సినిమాలు చెబుతుంటాయి. అయితే స్టార్ హీరోల్ని దృష్టిలో పెట్టుకొని కథలు అల్లుకొనేటప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ తప్పకుండా ఉండాలి కాబట్టి సందేశాన్ని, మాస్ ఎలిమెంట్స్ ను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా నడపాలి. 'జనతా గ్యారేజ్' ను కూడా 'కొరటాల' అదే రూట్లో ట్రావెల్ చేయించాడు. చక్కటి పాయింట్ ను అతి చక్కని ప్రజెంటేషన్ తో అదరగొట్టాడు. కాకపోతే ఇందులో 'యన్టీఆర్' రెగ్యులర్ సినిమాల మాదిరిగా పంచ్ డైలాగ్స్ ఉండవు, ఆవేశపు డైలాగ్స్ అసలుండవు. కేవలం కథకు అవసరమయ్యే మంచి డైలాగులు మాత్రమే వినిపిస్తాయి. కాకపోతే కథ పాతదే అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన చెత్త సినిమాల వల్ల వచ్చిన పొల్యూషన్ అంతా 'జనతా గ్యారేజ్' తో కొట్టుకుపోతుందని చెప్పుకోవచ్చు. టోటల్ గా 'జనతా గ్యారేజ్' ఓ క్లాసికల్ మాస్ మూవీ అని చెప్పాలి. కథ ఎక్కడా డీవియేట్ అవకుండా అనుకున్న పాయింట్ ను అనుకున్నట్టుగా తెరకెక్కించాడు 'కొరటాల శివ'.

కథ..
ఊళ్ళో జనానికి ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ కి వెళతారు. కానీ పోలీస్ స్టేషన్ లో లభించే న్యాయం కన్నా 'జనతా గ్యారేజ్' హెడ్ సత్యం చేసే న్యాయానికే ఎక్కువ విలువనిచ్చి అతడ్ని దేవుడిలా భావిస్తారు ఊరి జనం. దాని వల్ల తన సొంత తమ్ముడు, అతడి భార్యని కోల్పోతాడు. ఫలితంగా సత్యం తమ్ముడి కొడుకుని, అతడి మేనమామ సత్యానికి దూరంగా తీసుకెళ్లిపోతాడు. మొక్కలంటే ప్రాణం పెట్టే ఆనంద్ కొన్ని పరిస్థితుల వల్ల సత్యమే తన పెదనాన్న అని తెలియకుండానే 'జనతా గ్యారేజ్' లోకి అడుగుపెడతాడు. ఆ తరువాత జరిగే ఆసక్తికరమైన మలుపులతో 'జనతా గ్యారేజ్' ప్రేక్షకుల్ని ఎమోషన్స్ తో కట్టి పడేస్తుంది. ముఖ్యంగా 'యన్టీఆర్', 'మోహన్ లాల్' పాత్రలు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్. ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా నడిచిపోతుంది. ఇంటర్వెల్ దగ్గర దిమ్మతిరిగే బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్ దగ్గరనుంచి సినిమా జనాన్ని కుర్చీలకు కట్టేస్తుంది.

పాత్రల తీరు తెన్నులు...
'మోహన్ లాల్' ను కంప్లీట్ యాక్టర్ అని ఎందుకంటారో ఈ సినిమా చూస్తే అర్ధమౌతుంది. డైలాగ్స్ ఏమీ లేకపోయినా కొన్ని కొన్ని సీన్స్ లో ఆయనిచ్చే ఎక్స్ ప్రెషన్స్ ఎక్స్ ట్రార్డినరీ. ఓన్ వాయిస్ వినిపించలేదని మనకి ఒకటే లోటుగా అనిపిస్తుంది తప్పితే ఆయన పెర్ఫార్మెన్స్ కు ఎవరూ పేరు పెట్టలేరు. అంతేకాదు 'యన్టీఆర్' కూడా ఈ సినిమాతో కంప్లీట్ యాక్టర్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా గ్యారేజ్ లోకి యన్టీఆర్ ఎంటర్ అయిన దగ్గరనుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళుతుంది. కాకపోతే విలన్ తో 'జనతా గ్యారేజ్' కు ఉన్న కాన్ ఫ్లిక్ట్ అంత బలంగా అనిపించదు. విలన్ గా నటించిన 'సచిన్ కేడ్కర్' పాత్ర చివరికి తేలిపోయినట్టు అనిపిస్తుంది. 'మోహన్ లాల్' కొడుకుగా నటించిన 'ఉన్ని ముకుందన్' పాత్ర కూడా ఏమంత గొప్పగా అనిపించదు. అయితే ఇందులో కొన్ని ఎమోషన్ సీన్స్ తో జనం బాగా కనెక్ట్ అయిపోతారు. ముఖ్యంగా 'జనతా గ్యారేజ్' కోసం 'సమంతా' మీద ఉన్న ప్రేమను త్యాగం చేసే సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిపోతుంది. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ లో 'యన్టీఆర్' 'మోహన్ లాల్' దగ్గరకి వచ్చి కొడుకు గురించి చెప్పేసీన్ కూడా బాగా పండింది. 'రాజీవ్ కనకాల' ఆఫీస్ కి 'యన్టీఆర్' వచ్చే సీన్ అయితే అదిరిపోతుంది. ఇక క్లైమాక్స్ సీన్ లో ఎమోషన్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాని మాస్ జనం, ముఖ్యంగా 'యన్టీఆర్' ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే డౌట్. ఎనీహౌ 'జనతా గ్యారేజ్' ఈజ్ ఎ క్లాసిక్ ఎంటర్ టైనర్ .

ప్లస్ పాయింట్స్ :
మోహన్ లాల్, యన్టీఆర్ నటన
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఎమోషన్స్
సెంకడాఫ్ కథ
ఫోటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :
విలన్ కేరెక్టర్
ఎన్టీఆర్ లక్షణాన్ని సెకండాఫ్ నుంచి వదిలి పెట్టడం.
ఇద్దరు హీరోయిన్స్.

రేటింగ్ : 2.75/5

Don't Miss