జైలు డ్రెస్ వేసుకోని సల్మాన్...

18:09 - April 7, 2018

ముంబై : కృష్ణ జింకల కేసులో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు బెయిల్‌ మంజూరైంది. సల్మాన్‌ బెయిలు పిటిషన్‌పై విచారణ జరిపిన జోధ్‌పూర్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 50 వేల పూచీకత్తుపై కోర్టు సల్మాన్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. సల్మాన్‌ఖాన్‌ ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నారు. గత రాత్రి రాజస్థాన్ ప్రభుత్వం 87 మంది జడ్జిలను అకస్మాత్తుగా బదిలీ చేసింది. అందులో సల్మాన్ కేసును విచారిస్తున్న జడ్జి రవీంద్ర కుమార్ జోషి కూడా ఉండడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. కానీ ఆయన ఉదయం విధులకు హాజరై సల్మాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపారు. 20 ఏళ్ల పాటు కొనసాగిన ఈ కేసులో సల్మాన్‌ఖాన్‌ కోర్టును ఎప్పుడూ కూడా అవహేళన చేయలేదని, ఆయనకు ఊరట కల్పించాలని విచారణ సందర్భంగా సల్మాన్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఘటనా స్థలంలో సరైన ఆధారాలు లభించలేదని సల్మాన్‌ తరపు న్యాయవాది హస్తీమాల్‌ సారస్వత్‌ అన్నారు. కాగా సల్మాన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్‌ కోరింది. రెండు కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్‌ఖాన్‌కు గురువారం ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో 106 నంబరు ఖైదీగా ఉన్న సల్మాన్‌ఖాన్‌ భోజనం చేయకున్నా... క్రమం తప్పకుండా చేసే వ్యాయమాన్ని వదలలేదు. శుక్రవారం సాయంత్రం తాను ఉంటున్న వార్డ్‌ నెంబర్‌ 2లో సుమారు మూడు గంటలపాటు వ్యాయామం చేశారని జైలు అధికారులు వెల్లడించారు. క్రంచెజ్, పుశ్‌ అప్స్‌, స్కిప్పింగ్‌, జంపింగ్‌ లాంటి ఎక్సర్‌సైజ్‌లు చేశారు. సల్మాన్‌ జైలులో రాత్రి భోజనం ఖిచిడీ శెనగలు తినడానికి నిరాకరించారు. శుక్రవారం ఉదయం అల్పాహారం కింద బీన్స్‌, పాలను కూడా తీసుకోలేదు. దీనికి బదులు జైలు క్యాంటీన్‌ నుంచి పాలు బ్రెడ్‌ తెప్పించుకుని తిన్నారు. ఇందుకోసం సల్మాన్‌ కుటుంబం జైలు క్యాంటీన్‌లో 4 వందలు రూపాయలు చెల్లించింది. సల్మాన్‌ మధ్యాహ్నం పప్పు, చపాతి, మిక్స్‌డ్‌ వెజ్‌ తిన్నారు. సెలబ్రిటీ ఖైదీ అయినప్పటికీ సల్మాన్‌కు ప్రత్యేక వసతులు కల్పించడం లేదని జైలు సూపరింటిండెంట్‌ విక్రమ్‌ సింగ్‌ తెలిపారు. సల్మాన్‌ గదిలో కర్ర మంచం, రగ్గు, కూలర్‌ ఏర్పాటు చేశారు. జైలు దుస్తులు వేసుకోవడానికి సల్మాన్‌ నిరాకరించారు.

Don't Miss