గౌరీ లంకేష్ హత్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసన

21:46 - September 6, 2017

హైదరాబాద్ : సీనియర్‌ జర్నలిస్టు గౌరీలంకేష్‌ హత్యపై నిరననలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప‍్తంగా ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. జర్నలిస్టులు గౌరీ హత్యకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక‍్తం చేస్తున్నారు. బెంగళూరులోని మీడియా హాల్‌లో పాత్రికేయులు ఆందోళనకు దిగారు. గూండాల తూటాలకు జర్నలిజం తలవంచదని నినదించారు. సీపీఎం, ప్రజాసంఘాలు హత్యను తీవ్రంగా ఖండిస్తూ నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఢిల్లీలో సీపీఎం నాయకులు గౌరీలంకేశ్‌ దారుణ హత్యను తీవ్రంగా ఖండించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, హిందుత్వవాదులకు ఎవరైనా ఎదురుతిరిగితే హత్యలకు పాల్పడుతున్నారని సీతారాం ఏచూరి అన్నారు. సంఘ్‌పరివార్‌ ఇలాంటి విషపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ అన్నారు. గౌరీపై దాడిని భారత సంస్కృతిపై దాడిగా చూడాలన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు. ఇది ఓ జర్నలిస్టును హత్య చేయడం కాదు.. ఏకంగా ఒక వ్యవస్థనే హత్య చేయడమన్నారు.

దోషులను తక్షణమే అరెస్ట్‌ చేయాలి
హైదరాబాద్‌లోనూ జర్నలిస్టుల ఆందోళనలు నిర్వహించారు. గౌరీలంకేశ్‌ హత్యను ఐజేయూ తీవ్రంగా ఖండించింది. గౌరీ హత్య ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించింది. ఇలాంటి దాడులను జర్నలిస్టులంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. దోషులను తక్షణమే అరెస్ట్‌ చేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు బషీర్‌బాగ్‌ చౌరస్తాలో నిరసన తెలిపారు. బంజారాహిల్స్‌లో జర్నలిస్ట్‌లు ఆందోళనకు దిగారు. హత్యలతో అక్షరాన్ని ఆపలేరని ప్లకార్డులు చేతపట్టి నినదించారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో నల్లరిబ్బన్స్‌తో నిరసన తెలిపారు. గౌరీలంకేష్‌ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ, హత్యలకు పాల్పడటం దారుణమని TWJF రాష్ట్రకార్యదర్శి బసవ పున్నయ్య అన్నారు.

విజయవాడ ప్రెస్‌క్లబ్ ఆధ్యర్యంలో
విజయవాడ ప్రెస్‌క్లబ్, ఐజేయూ, APUWJఆధ్వర్యంలో జర్నలిస్టులు.. గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో నిరసన వ్యక్తం చేశారు. దేశంలో అసహన, విద్వేష చీకటి కోణాన్ని బయటపెట్టడంలో గౌరీలంకేష్‌ కీలకపాత్ర పోషించారని చెప్పారు. హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్న శక్తులే ఆమె ప్రాణాలను బలిగొనడానికి కారణమన్నారు. నిజం గొంతు నొక్కలేరని.. వెంటనే గౌరీ లంకేశ్‌ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కడప బిల్డప్‌ సర్కిర్ వద్ద APUWJఆధ్వర్యంలో జర్నలిస్టులు రాస్తారోకోకు దిగారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక భద్రత కరువైందని.. జర్నలిస్టులపై దాడులు పెరిగపోయాయని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని లేనిపక్షంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అటు CPI నాయకులు, కార్యకర్తలు కడప నగరంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ హత్య మతోన్మాద శక్తులపనేనని ఆరోపిస్తూ, వీరికి బుద్ధి చెప్సే అనంతపురంలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాదుల హస్తం ఉందని ఘాటుగా విమర్శించారు. సమాజంలో జరిగే దౌర్జన్యాలను వేలెత్తిచూపినందుకే గౌరీలంకేష్‌ను పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. జైపూర్‌ ,గుజరాత్‌, ఢిల్లీ, ముంబై, చెన్నై, చండీగడ్‌, లక్నో,కోలకతా నగరాల్లో జర్నలిస్ట్ సంఘాలు, ప్రెస్‌ క్లబ్‌ల ఆధ్వర్యంలో గౌరి హత్యను ఖండిస్తూ ధర్నాలు, ర్యాలీ, కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమాలను చేపట్టారు. 

Don't Miss