అభివృద్ధికి ఆమడ దూరంలో....

18:38 - January 6, 2017

కామారెడ్డి : మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమది. అక్కడ మూడు రాష్ట్రాల ప్రజలు విభిన్నంగా ఎవరి సంస్కృతులు, సంప్రదాయాల ప్రకారం వారు జీవిస్తున్నారు. మహరాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ మూడు సరిహద్దులు కలిగిన ఓ ప్రాంతం అత్యంత వెనకబడింది. నాయకులు అటువైపే చూడకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. 
జుక్కల్‌ ప్రాంతం 
కామారెడ్డి జిల్లా జుక్కల్‌ ప్రాంతం ఇది. గతంలో నిజామాబాద్‌ జిల్లాలో ఉండేది. నిజామాబాద్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జుక్కల్‌ ప్రాంతం త్రిభాష సంగమంగా పేరుగాంచింది. ఈ నియోజకవర్గం ఏ రాష్ట్ర పరిధిలో ఉన్నా ఏ జిల్లాలో కలిసినా తనదైన శైలిని కొనసాగిస్తూ జీవనం గడుపుతున్నారు ఇక్కడి ప్రజలు. జుక్కల్‌, బిచ్కుంద, మద్నూరు ప్రాంతాలు గతంలో మహరాష్ట్రలో ఉండటంతో ఇక్కడ అధిక శాతం మరాఠీ సంస్కృతి నెలకొంది. 1956వ సంవత్సరంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా ఈ ప్రాంతాలు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ లోని నిజామాబాద్‌ జిల్లాలో కలిశాయి. 
తెలుగులోకి అధికార లావాదేవీలు 
ఆ తర్వాత మరాఠీలో కొనసాగిన అధికార లావాదేవీలను తెలుగులోకి మార్చారు. ఇక 2014 లో తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా అవతరించటంతో జుక్కల్ మరోసారి తన రాష్ర్టం పేరు మార్చుకుంది. తాజాగా జిల్లాల పునర్విభజనతో ఈ సారి జిల్లా పేరును మార్చుకోక తప్పని సరైంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం కొన్ని ఆచార సంప్రదాయాల్లో మిగతా ఈ మూడు నియోజకవర్గాల కన్నా భిన్నంగా కనిపిస్తుంది.
సోపూర్ గ్రామస్తులు నానా అవస్థలు 
అయితే జుక్కల్ మండలంలోని సోపూర్ అనే గ్రామం ఉంది. మానూరు గ్రామం అనేది మహరాష్ర్టకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్ణాటక, తెలంగాణకు మధ్య ఒక బ్రిడ్జి ఉంది. మూడు కోట్ల 45 లక్షలతో కర్ణాటక ప్రభుత్వం నిర్మించింది. ఈ బ్రిడ్జి మీదుగానే రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలకు కర్ణాటకలోని ఔరాద్, మహరాష్ర్టలోని దెగ్లూరు బస్సులు నడుస్తుంటాయి. పల్లెల్లో రోడ్ల సదుపాయాలు సరిగ్గా లేనందున చాలా ఇబ్బందికరంగా మారింది. అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. కనీస సౌకర్యాలు లేక సరిహద్దు గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 
అధ్వానంగా రోడ్లు  
మూడు రాష్ర్టాల కూడలి కావటంతో ఈ ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ అధికారులు, నేతలు అటువైపే రాకపోవడంతో ప్రజల సమస్యలు ఎక్కువయ్యాయి. ఇక్కడి నుంచే మూడు రాష్ట్రాలకు రాకపోకలు కొనసాగుతున్నా రోడ్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ తెలుగు మీడియం పాఠశాలలు ఉన్నప్పటికీ చాలా మంది విద్యార్ధులు వాడుక భాషగా మరాఠీని వినియోగిస్తారు. ముఖ్యంగా హంగర్గా, చండేగావ్, మాదాపూర్, ఖరగ్, తడ్గూరు, అంతాపూర్ తదితర గ్రామాలలో పని చేసే టీచర్లు ఈ భాష సమస్యను ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉండే ఉపాధ్యాయులు తెలుగు పాఠాలను మరాఠీలోకి అనువదించి చెబుతారు.
ప్రజలు నానా ఇబ్బందులు 
అన్ని రంగాల్లో వెనకబడిన ఈ ప్రాంతంలో అభివృద్ధి ఊసే ఎత్తకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిహద్దే శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. 

 

Don't Miss