దుమారం రేపుతున్న కేసీఆర్ అనంత పర్యటన

07:31 - October 12, 2017

అనంతపురం : వెంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చింది అనే సామెత టీ టీడీపీకి సరిగ్గా సరిపోతుంది. ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌ వివాహం టీ టీడీపీని డైలమాలో పడేసింది. ఈనెల 1న పరిటాల శ్రీరామ్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి తనయుడు, మరీ ముఖ్యంగా పరిటాల రవి కుమారుడు వివాహం కావడంతో చాలామంది వీవీఐపీలు ఈ వివాహానికి హాజరయ్యారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఈ పెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరవ్వడంతో టీడీపీని షేక్‌ చేస్తోంది.

కేసీఆర్‌కు ఏపీ టీడీపీ నేతలు స్వాగతం
ఏపీ సీఎం చంద్రబాబుతోసహా తెలంగాణ సీఎం కేసీఆర్‌ శ్రీరామ్‌ వివాహానికి హాజరయ్యారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన కేసీఆర్‌కు ఏపీ టీడీపీ నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్‌ను దగ్గరుండి రిసీవ్‌ చేసుకోవడంతోపాటు అన్నితామై ఆయన తిరిగి వెళ్లేవరకు వెన్నంటే ఉన్నారు. ఆయనకు ఏంకావాలన్నా దగ్గరుండి చూసుకున్నారు. దీంతో ఏపీ టీడీపీ నేతలపై టీ టీడీపీనేతలు మండిపడుతుననారు. ఏపీ టీడీపీ నేతలు కేసీఆర్‌ వచ్చినప్పుడు ఓవరాక్షన్‌ చేశారని అధినేతకు కంప్లైంట్‌ చేయడం ఇప్పుడు హాట్‌టాఫిక్‌ మారింది. పక్కరాష్ట్రం సీఎం వచ్చినప్పుడు గౌరవించాలికానీ.. మరీ అంత ఓవరాక్షన్‌ అవసరమా అంటూ చంద్రబాబు ముందు పంచాయతీ పెట్టారు. తెలంగాణలో పార్టీని తిరిగి ట్రాక్‌ ఎక్కించేందుకు కేసీఆర్‌ తాము పోరాటం చేస్తోంటే.. ఏపీ టీడీపీనేతలు కేసీఆర్‌తో రాసిపూసుకుని తిరిగి పార్టీ మైలేజ్‌ను దెబ్బతీశారన్నది టీ టీడీపీ నేతల వాదన. టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ కేసీఆర్‌తో రహస్యంగా మంతనాలు జరపడం, తదనంతర పరిణామాలు అన్నీ తమకు తెలంగాణలో ఇబ్బందిగా మారాయని చంద్రబాబుకు కంప్లైంట్‌ చేశారు. ఏపీ టీడీపీ నేతల పనితో తాము తలెత్తుకోలేకపోతున్నామని... అందుకే రాజీనామాలు చేస్తామని చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.

టీడీపీని మాత్రం ఇబ్బందుల్లోకి నెట్టింది
టీ టీడీపీ నేతల కంప్లైంట్‌తో చంద్రబాబు రంగంలోకి దిగారు. ఏపీ నేతలకు ఫుల్‌ క్లాస్‌ తీసుకున్నారు. పార్టీలో సీనియర్‌ అయిన పయ్యావుల కేశవ్‌ ఇలా చేయడమేంటని మండిపడ్డారు. చంద్రబాబు చీవాట్లతో పయ్యావుల మనస్తాపానికి గురయ్యారు. కేసీఆర్‌ తనను రమ్మని పిలిస్తేనే వెళ్లాలనని, అందులో తన తప్పేమీ లేదని సంజాయిషీ కూడా ఇచ్చుకున్నారు. మొత్తానికి కేసీఆర్‌ అనంత పర్యటన టీడీపీని మాత్రం ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి. సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవుతున్న కేసీఆర్‌ టూర్‌పై చివరిరి చంద్రబాబు ఒకరికి సర్దిచెప్పడంతోపాటు మరొకరికి వార్నింగ్‌ ఇవ్వాల్సి వచ్చింది. మరి ఇకనైనా టీడీపీ నేతలు జాగ్రత్తగా వ్యవహరిస్తారో లేదో వేచి చూడాలి.

Don't Miss