కేసీఆర్ 63వ జన్మదిన వేడుకలు

19:19 - February 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు 63వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ సందర్భంగా.. టీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా రక్త దానం, అన్నదానంతోపాటు  పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని వివిధ సభల్లో వక్తలు ప్రస్తుతించారు. 
కేసీఆర్‌ ఛాయా చిత్రాల ప్రదర్శన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ కూతురు కవిత, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని కేక్‌ కట్‌ చేశారు. అనంతరం కేసీఆర్‌ ఛాయా చిత్రాల ప్రదర్శనను కవిత ప్రారంభించారు. తెలంగాణ జాతి పునర్నిర్మాణానికి అందరూ పునరంకితం కావాలని ఆమె పిలుపునిచ్చారు. 
ట్విట్టర్‌ ద్వారా కేటీఆర్‌ బర్త్‌ డే విషెస్‌ 
కేసీఆర్‌కు ఆయన కుమారుడు కేటీఆర్‌..  ట్విట్టర్‌ ద్వారా బర్త్‌ డే విషెస్‌ తెలిపారు.  తెలంగాణ జన్మనిచ్చిన అతిగొప్ప కుమారుడు కేసీఆర్‌ అని, ఆయన కుమారుడిగా పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నానంటూ పోస్ట్‌ చేశారు.
ప్రగతి భవన్‌లోనూ బర్త్‌డే వేడుకలు 
ప్రగతి భవన్‌లోనూ కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో జరిగిన వేడుకలకు మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. బర్త్‌డే కేక్‌ కట్‌చేసి స్వీట్లు పంచారు.  అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఇక  పెద్దమ్మ గుడిలో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓయూలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆధ్వర్యంలో విద్యార్దులు 2కే రన్‌ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సినీ నిర్మాత సి. కల్యాణ్‌ పాల్గొన్నారు. రాజేంద్రనగర్‌, మల్కాజ్‌గిరి, మలక్‌పేటతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలను టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. 
చైనాలోనూ కేసీఆర్ బర్త్ డే వేడుకలు
కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు చైనాలోనూ ఘనంగా నిర్వహించారు. చైనా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్‌ కేక్‌ కట్‌ చేశారు. ఇక ఢిల్లీలోనూ కేసీఆర్‌ జన్మదిన వేడుకలు జరిగాయి. అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం.. గుంటూరు జిల్లా తెనాలిలోనూ కేసీఆర్‌ బర్త్‌డే సంబరాలు జరిగాయి. కేసీఆర్‌ అభిమాన సంఘం ఆధ్వర్యంలో కొంతమంది యువకులు  శబరి వృద్ధాశ్రమంలో కేక్‌ కట్‌ చేశారు. వృద్ధులకు అన్నదానం చేశారు. కేసీఆర్‌ క్షేమంగా ఉండాలని... ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు..

 

Don't Miss