ఉత్తమ్‌వి ఉత్తుత్తి మాటలే - కేటీఆర్...

13:43 - October 11, 2018

సిరిసిల్ల : మూడేళ్లలో సిరిసిల్ల రూపు రేఖలు మారుస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం సిరిసిల్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార సభలో మాట్లాడారు. నాలుగున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. సిరిసిల్లలో రూ. 16-20వేల రూపాయలు చేనేత కార్మికుడు సంపాదిస్తున్నాడని, ప్రభుత్వ ఆర్డర్ల ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతోందన్నారు. గతంలో ఉన్న ఫించన్లు గౌరవంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో కేసీఆర్ వాటిని పెంచారని తెలిపారు. హాస్టళ్లలో నాణ్యమైన బియ్యంతో పిల్లలు తినాలని భావించి అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్టు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి కేసులు పెరిగాయని, ఇందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం..కేసీఆర్ కారణమన్నారు. సిరిసిల్లకు రైలు తీసుకొస్తానని, జన్మనిచ్చింది తల్లి..అయితే రాజకీయంగా జన్మనిచ్చింది మాత్రం సిరిసిల్ల గడ్డ అని...ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. బీడీలు చుట్టే అవకాశం లేకుండా పదివేల మంది మహిళలకు శిక్షణ ఇచ్చి వారి కాళ్లపై నిలబడే విధంగా చేసి చూపిస్తానన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఏకమవుతున్నాయని, కేసీఆర్‌ను గద్దె దించాలని చెబుతున్నారని..ఎందుకు గద్దె దించాలో చెప్పాలని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తే గద్దె దించాలా అని పేర్కొన్నారు. గతంలో నల్లధనం విషయంలో ప్రధాన మంత్రి మోడీ ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టమొచ్చినట్లు హామీలు గుప్పిస్తున్నారని, రాష్ట్రంలో రూ. 2వేలు ఇస్తామని ప్రకటిస్తున్నారని..కానీ ఇతర రాష్ట్రంలో ఎందుకు మాట్లడడం లేదని నిలదీశారు. ఉత్తమ్ మాటలన్నీ ఉత్తుత్తివేనని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఆ పార్టీలో కొట్లాడుకుంటున్నారని, రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని..చెబుతున్నారని కానీ మాఫీకి అర్హత ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారని తెలిపారు. 

Don't Miss