అమీర్‌పేట-ఎల్బీనగర్‌ మెట్రో రైలు వచ్చేస్తోంది...

21:21 - August 10, 2018

హైదరాబాద్ : నగరంలో ప్రజారవాణ వ్యవస్థను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా మౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించింది. జంటనగరాల్లో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించే విధంగా ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌ల నిర్మాణాన్ని విస్తృతం చేయాలని నిర్ణయించినట్టు ఎల్బీ నగర్‌ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవంలో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ ఎల్వీ నగర్‌ కామినేని ఆస్పత్రి వద్ద 50 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మించారు. వ్యూహాత్మక రహదారులు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పథకాల్లో ఇది నాల్గవది.

ఇంతకు ముందుకు చింతల్‌కుంట, మైండ్‌స్పేస్‌ జంక్షన్‌, అయ్యప్ప సొసైటీ అండర్‌ పాస్‌లను ప్రారంభించారు. ఎల్బీనగర్‌ వద్ద మూడు వరుసల్లో నిర్మిస్తున్న మరో ఫ్లై ఓవర్‌ను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ను ఈనెలాఖరు నాటికి, గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌ వచ్చే ఏడాది మార్చికి పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టింది. కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఫ్లై ఓవర్‌ను డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌ను 2019 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎల్బీనగర్‌ ప్రాంతంలోనే 450 కోట్లతో నిర్మిస్తున్న రోడ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మెగా సిటీగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా చెప్పారు.

జంట నగరాల జనాభా కోటికి చేరింది. వ్యక్తిగత వాహనాలు 50 లక్షల వరకు ఉన్నాయి. రోడ్లు ఎంత విస్తరించినా సరిపోని పరిస్థితి ఉంది. తరచు ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిని తగ్గించేందుకు బీఆర్‌టీఎస్‌, ఎంఎంటీఎస్‌, మెట్రో రైలు వ్యవస్థలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్‌ సేఫ్టీ నుంచి ధ్రువీకరణ వచ్చిన తర్వాత అమీర్‌పేట-ఎల్బీనగర్‌ మెట్రో రైలును వచ్చే నెలలో అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

Don't Miss