కడప ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్

19:16 - September 4, 2017

కడప : హాట్ హాట్ రాజకీయాలకు కడప కేరాఫ్ అడ్రస్. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గట్టి పట్టు వుండేది. ఆయన అనుచరులే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యే అంజద్ బాషా వైఎస్ కుటుంబ అండదండలతో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, 2014లో వైసిపి అభ్యర్థిగా విజయం సాధించారు అంజద్ బషా. గత ఎన్నికల్లో కడప ఓటర్లకు చాలా హామీలిచ్చారు అంజద్ బాషా. వీటిలో ముఖ్యమైనది కడప పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించడం, ట్రాఫిక్ సమస్యను తీర్చడం. అధ్వాన్నంగా వున్న డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం. కడప విమానాశ్రయం ఏర్పాటుకు కృషి, రిమ్స్ ను ఎయిమ్స్ గా మార్చడం, పరిశ్రమలు ఏర్పాటు చేయించి, యువతకు ఉపాధి చూపించడం, యోగి వేమన యూనివర్సిటీలోని పెండింగ్ భవనాల నిర్మాణాలను పూర్తి చేయించడం ఇలా అనేక హామీలిచ్చారు అంజద్ బాషా.

రిమ్స్ ఎయిమ్స్ గా మారలేదు...
తాగునీటి సమస్య, ట్రాఫిక్ సమస్య, డ్రైనేజీ సమస్య పరిష్కారం కాలేదు. రిమ్స్ ఎయిమ్స్ గా మారలేదు. కనీస సౌకర్యాలు లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన హామీలేవీ నెరవేర్చకపోవడంతో ఎమ్మెల్యే జనంలో అసంతృప్తి రాజుకుంటోంది. తెలుగుదేశం ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యహరిస్తూ, నిధులు విడుదల చేయడం లేదంటున్నా కడప ఎమ్మెల్యే అంజద్ బాషా. ఎమ్మెల్యేగా తన మాట పట్టించుకోకుండా, టిడిపి నియోజకవర్గ ఇన్ చార్జి చెప్పే పనులకే ప్రాధాన్యతనిస్తున్నారంటూ విమర్శిస్తున్నారాయన. తాను ఎమ్మెల్యేగా వున్నా లేనట్టేనన్న పరిస్థితి ప్రభుత్వం సృష్టించిందంటున్నారు అంజద్ బాషా.

ఎమ్మెల్యేకి అభివృద్ధి మీద కంటే అవినీతి మీదే ఎక్కువ ధ్యాస
ఎమ్మెల్యే మాటలను కొట్టిపారేస్తున్నారు టిడిపి నియోజకవర్గ ఇన్ చార్జి శ్రీనివాస్ రెడ్డి. ఎమ్మెల్యేకి అభివృద్ధి మీద కంటే అవినీతి మీదే ఎక్కువ ధ్యాస వుందన్నది టిడిపి విమర్శ. కార్పొరేషన్ కు నిధులు సాధించకపోగా, వచ్చే పనులను కూడా మేయర్, ఎమ్యెల్యే కలిసి కాజేస్తున్నారన్నది టిడిపి ఆరోపణ. ప్రభుత్వంతో మాట్లాడి కడపలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ కోసం ఆరున్నర కోట్లు ఖర్చు చేసినట్టు టిడిపి చెబుతోంది. తాగునీటి సమస్య పరిష్కారం కోసం 75 కోట్లతో లింగంపల్లి చెక్ డ్యాం నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించామంటున్నారు టిడిపి నేతలు.రాజకీయ పార్టీల విమర్శల సంగతెలా వున్నా, కడప అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజికవర్గాలు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. నియోజకవర్గంలో 30శాతం మంది ముస్లింలు, మరో 30శాతం మంది బిసిలున్నారు. క్రిస్టియన్, రెడ్డి, కాపు సామాజిక వర్గాలూ గెలుపు ఓటమిలను నిర్ణయిస్తుంటాయి. 

Don't Miss