నల్లబెల్లం కొనుగోలు కిరికిరి..

13:36 - January 2, 2017

కామారెడ్డి : నల్లబెల్లానికి పెట్టింది పేరు కామారెడ్డి. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వ నిబంధనల కారణంగా నల్లబెల్లం తయారుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ బెల్లం తయారీ, రవాణాపై అధికారులు పలు ఆంక్షలు విధించడంతో రైతులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. నల్లబెల్లానికి పెట్టింది పేరైనా కామారెడ్డి జిల్లాలో నల్లబెల్లం కొనుగోలు కిరికిరి వీడటం లేదు. సంవత్సరం పాటు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లో నల్లబెల్లానికి బాగా డిమాండ్ ఉన్నా ప్రభుత్వ నిబంధనల కారణంగా లాభాలు పొందలేకపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి డివిజన్‌లోని మాచారెడ్డి, తాడ్వాయి, బిక్కనూరు మండలాల్లో గతేడాది తయారు చేసిన నల్లబెల్లం నిలువలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నల్లబెల్లం రవాణాపై ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతుండడంతో బెల్లం కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో వ్యాపారం పడిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఆదుకోవాలంటున్న రైతులు..
ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో నల్లబెల్లం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆంక్షలను తెలంగాణ ప్రభుత్వం కొనసాగించడం ఏంటనీ రైతులు, వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనైనా మద్దతు ధర వస్తుందని భావించిన తమకు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. సీజన్ చివరలో మార్క్‌ఫెడ్‌ ద్వారా బెల్లం కొనుగోలు చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు. ఈ సారైనా సీజన్ ప్రారంభంలో మార్క్ పెడ్ ద్వారా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుందని రైతులు భావించారు. కానీ ఇప్పటి వరకు బెల్లం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. మార్క్ పెడ్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, దళారులు కుమ్మక్కు అయ్యారని.. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జనవవరి నెలలో బెల్లం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Don't Miss