అరుణిమ సిన్హాగా కంగనా రనౌత్...

17:44 - January 11, 2018

ఆర్‌.బాల్కీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కంగనా రనౌత్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి భారతీయ వికలాంగ మహిళా అరుణిమ సిన్హా జీవితం ఆధారంగా ఆర్‌.బాల్కీ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో అరుణిమ సిన్హా పాత్రకు కంగనాను ఎంపిక చేశారట. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మెంటర్‌ పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం కంగనా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోనుందట. 'ఈ పాత్రకు కంగనా నూటికి నూరుశాతం న్యాయం చేయగలదనే నమ్మకంతో ఉన్నాం. అలాగే ఆమె మెంటర్‌గా బిగ్‌ బి అమితాబ్‌ నటించడం ఆనందంగా ఉంది. అత్యద్భుత ప్రతిభ గల ఇద్దరు ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించడం విశేషంగా భావిస్తున్నాను' అని దర్శక, నిర్మాత ఆర్‌.బాల్కీ తెలిపారు. ఇదిలా ఉంటే ఝాన్సీ రాణి లక్ష్మిభాయి జీవిత కథను ఆధారంగా చేసుకుని హిస్టారికల్‌ నేపథ్యంలో దర్శకుడు క్రిష్‌ 'మణికర్ణిక : ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కంగనా రనౌత్ నటిస్తోంది. ఈ సినిమాను మొదట మార్చిలో లేదా ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నారు. సినిమాలో విజువల్‌ ఎఫెక్స్‌కి సంబంధించిన వర్క్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఈ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడనుందట. ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్‌ ఉన్న నేపథ్యంలో ఇండో బ్రిటీష్‌ చిత్రం 'స్వార్డ్స్‌ అండ్‌ స్కెప్ట్రెస్‌' చిత్రం బృందం రిలాక్స్‌ అయ్యింది. దీనికి కారణం ఈ చిత్రాన్ని కూడా లక్ష్మీభాయి జీవితాన్ని బేస్‌ చేసుకునే రూపొందించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చిలో విడుదల చేయనున్నారు.

 

Don't Miss