నెత్తురోడుతున్న కరీంనగర్...వరంగల్ ప్రధాన రహదారి

08:38 - May 31, 2018

కరీంనగర్ : కరీంనగర్...వరంగల్ ప్రధాన రహదారి మృత్యు మార్గాన్ని తలపిస్తోంది. తరుచుగా జరుగుతున్న ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. మరెందరో క్షతగాత్రులవుతున్నారు.  రెండేళ్ల క్రితమే జాతీయ రహదారి పరిధిలోకి వెళ్లినా.. రోడ్డు విస్తరణ జరగక పోవడం ప్రజల పాలిట శాపంగా మారింది. నెత్తురోడుతున్నరహదారి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. 
అతివేగంతో నిత్యం వందలాది వాహనాలు 
ఇది కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారి. ఇక్కడ నిత్యం వందలాది వాహనాలు అతివేగంతో దూసుకెళ్తుంటాయి.  దీంతో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు పై నెత్తురు చిందుతూనే ఉంటుంది. మానకొండూర్ చెరువు మూల మలుపు, శంషాబాద్, చెంజర్ల మూల మలుపు, తాడికల్ మూల మలుపు, కొత్తగట్టు, ఎరుకల గూడెం క్రాసింగ్, ఈదల గట్టెపల్లి, సింగాపురం, తుమ్మనపల్లి వంతెన, పెంచికల్ పేట, కోతుల నడుమ క్రాసింగ్ వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి.  డేంజర్‌ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో  హెచ్చరికల బోర్డులు పెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది.
చెంజర్ల వద్ద రోడ్డు ప్రమాదం
మానకోండుర్ మండలం చెంజర్ల వద్ద మంగళ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంతో దూసుకొచ్చిన లారీ.. ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో.. బస్సు ఒక వైపు నుజ్జు నుజ్జయింది. నేతలు, అధికారులు పరామర్శలకు పరిమితం కావడం తప్ప.. నివారణ చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
గంటకు సుమారుగా 300 నుంచి 500 వరకు వాహనాలు  
ఈ రహదారిలో గంటకు సుమారుగా 300 నుంచి 500 వరకు వాహనాలు వెళ్తున్నట్లు అధికారులే చెప్తున్నారు. 30 టన్నుల సామర్థ్యం ఉన్నవాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. కానీ చాలా వాహనాలు ఓవర్ లోడ్‌తో వెళ్తున్నా పోలీసు, రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేశవ పట్నం, హుజురాబాద్, ఎల్కతుర్తి వరకు ప్రధాన రహదారి పక్కనే పోలీసు స్టేషన్లు ఉన్నా వాహనదారులు లెక్కచేయడంలేదు.
2015లో మంత్రి ఈటెల వాహనం బోల్తా
2015లో హుజురాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న మంత్రి ఈటెల రాజేందర్ వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఇంత వరకూ ఆ ప్రదేశంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. ఈ నెల 10న సీఎం సభకు బందోబస్తుకు వెళ్లి వస్తుండగా చెంజర్ల వద్ద పోలీస్ వాహనం-కారు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 20 రోజుల క్రితం శంషాబాద్ వద్ద  ఒకరు, తాడికల్ ఐదుగురు, కొత్తగట్టు వద్ద ముగ్గురు, సింగాపురం వద్ద ఇద్దరు, మృత్యువాత పడ్డారు. ఏడాదిన్నర వ్యవధిలో తాడికల్, హుజురాబాద్ మధ్య జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 54 మంది వరకు మృతి చెందారు. 36 మంది గాయపడ్డారు.
130 కి.మీ మేర జా.రహదారిగా మార్చాలని నిర్ణయం
జగిత్యాల నుంచి వరంగల్ వరకు 130 కిలో మీటర్ల మేర జాతీయ రహదారిగా మార్చాలని రెండేళ్ల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి మూడు వేల కోట్ల నిధులు, ఐదువందలా నలభై హెక్టార్లకు పైగా భూ సేకరణ చేయాలని అధికారులు నిర్ణయించారు. జగిత్యాల, వరంగల్ మధ్య ఐదు బైపాస్ రోడ్లు నిర్మాణానికి  332.92 హెక్టార్ల భూమి అవసరమని డిపిఆర్ రూపొంచారు. కానీ... భూ సేకరణకు ఆదిలోనే సమస్యలు తలెత్తాయి. పరిసర గ్రామాల ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో పనులు నిలిచి పోయాయి. మంత్రి ఈటెల రాజేందర్  చొరవ చూపినా ఫలితం లేకుండా పోతోంది.
రెండేళ్ల క్రితమే నేషనల్ హైవే పరిధిలోకి 
ఆర్ అండ్ బీ పరిధిలోని ఈ రహదారి రెండేళ్ల క్రితమే నేషనల్ హైవే పరిధిలోకి వెళ్లింది. దీంతో స్థానిక అధికారులు దాన్ని పట్టించుకోవడం మానేశారు.  తరుచు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై నిపుణుల కమిటి వేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదు. కనీసం వాహనాల వేగాన్ని నియంత్రించినా...  కొంత మేరకు ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. ప్రాణాలు పోయాక పరిహారం ఇచ్చినంత మాత్రాన పోయినోళ్ళు తిరిగిరారు. అధికారుల దృష్టిలో ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి ప్రాణ నష్టాన్ని అరికట్టాలని కోరుతున్నారు. 

 

Don't Miss