గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ..

18:45 - May 15, 2018

కర్ణాటక : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డా ఇంకా రాజకీయ వాతావరణం ఉత్కంఠగానే ఉంది. బీజేపీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ.. మెజార్టీ రాకపోవడంతో... ప్రభుత్వ ఏర్పాటు అంశం ఆసక్తికరంగా మారింది. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కకూడదన్న యోచనలో ఉన్న కాంగ్రెస్‌... జేడీఎస్‌కు మద్దతు ప్రకటించింది. కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపడితే బయటనుంచి మద్దతిస్తామని ప్రకటించింది. దీంతో కుమారస్వామి తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని గవర్నర్‌కు లేఖ రాశారు. మరోవైపు బీజేపీ జేడీఎస్‌లో చీలిక తెచ్చేందుకు యత్నిస్తోంది. దేవెగౌడ మరో కుమారుడు రేవణ్ణతో పాటు.. ఆయన వర్గానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేల మద్దతులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ యోచిస్తోంది. రేవణ్ణకు డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్‌ చేసింది. ఇక ఇప్పటికే బీజేపీ నేత యడ్యూరప్ప,.. కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు సిద్ధరామయ్య, కుమారస్వామిలు గవర్నర్‌ను కలిశారు. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఎవరికి అవకాశమిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు అంశం పూర్తిగా గవర్నర్‌ వాజు భాయ్ వాలా చేతుల్లోనే ఉంటుందని రాజ్యాంగ నిపుణులంటున్నారు. గతంలో సంప్రదాయాలను అనుసరించి అత్యధిక స్థానాలు సాధించిన పార్టీకే ప్రభుత్వ బాధ్యతలు అప్పగించి.. బలం నిరూపించుకునేందుకు సమయం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. జేడీఎస్‌-కాంగ్రెస్‌లు కూటమిగా కాకుండా.. విడివిడిగా పోటీ చేయడంతో... జేడీఎస్‌ విజ్ఞప్తిని గవర్నర్‌ పట్టించుకునే అవకాశం లేదంటున్నారు. దీనిని బట్టి చూస్తుంటే బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. 

Don't Miss