గౌరీ లంకేష్ హత్యపై సీరియస్ గా స్పందించిన కన్నడ సర్కార్

19:50 - September 6, 2017

బెంగుళూరు : కర్నాటక సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీలంకేశ్‌ హత్య.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి ఇద్దరు దుండగులు.. పాయింట్‌బ్లాంక్‌ రేంజ్‌లో గౌరిపై కాల్పులు జరిపి చంపేశారు. ఈ హత్యోదంతంపై యావద్భారతావనీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యవాదులు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో.. కర్నాటక సీఎం సిద్దరామయ్య.. హోంమంత్రి, ఉన్నతస్థాయి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం, కేసు దర్యాప్తు కోసం.. ఐజీ స్థాయి అధికారితో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేసింది.

సీసీటీవీ ఫుటేజి ఆధారంగా..
గౌరీలంకేశ్‌ హత్యకు సంబంధించి.. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆమె ఇంటి వద్ద ఉన్న రెండు సీసీ టీవీ కెమెరాలతో పాటు, బసవనగుడి దగ్గరున్న గాంధీబజార్‌లోని గౌరి కార్యాలయం నుంచి ఆమె ఇంటివరకూ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీనీ పోలీసులు పరిశీలించారు. ఆమె నివాసం నుంచి పాస్‌వర్డ్‌ ప్రొటెక్షన్‌ కల్గిన రెండు డీవీఆర్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ నిపుణుల సాయంతో వాటిని తెరచి పరిశీలిస్తున్నారు. హతురాలితో పాటు నిందితులు కూడా ఒకే ఫ్రేమ్‌లో ఉండే ఫొటోలు కొన్ని లభ్యమైనట్టు తెలుస్తోంది. వీటన్నింటినీ ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీకి పంపారు. ఇప్పటివరకూ లభించిన ఆధారాల మేరకు ఆమెపై కాల్పులు జరిపిన వారు ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌ అయి ఉంటారని, పకడ్బందీ రెక్కీ అనంతరమే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన ఓ యువకుడు
ఇంకోవైపు, హంతకుల గాలింపు కోసం ఓ రెండు బృందాలు ఇప్పటికే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు వెళ్లాయి. అటు, గౌరీలంకేశ్‌ను హతమారుస్తానంటూ.. ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన ఓ యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు. కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో.. నిందితులను 24 గంటల్లోపు పట్టుకు తీరాలని కన్నడ పోలీసులు పట్టుదలగా ఉన్నారు. గౌరీలంకేశ్‌ హత్యతో బెంగళూరులో హైఅలర్ట్‌ ప్రకటించారు. అటు కేంద్రం కూడా గౌరీలంకేశ్‌ హత్యపై వివరాలు సేకరిస్తోంది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు గౌరీలంకేష్ హత్య ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆమె సోద‌రుడు ఇంద్రజిత్ లంకేష్ డిమాండ్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలనను గౌరీ కుటుంబసభ్యుల సమక్షంలో నిర్వహించాలన్నారు.

హత్య వెనుక హిందూత్వ శక్తుల హస్తం
ఇంకోవైపు.. పోస్టుమార్టం అనంతరం, గౌరీలంకేశ్‌ మృతదేహానికి బెంగళూరులో.. అభిమానుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కన్నడ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్యను సీపీఎం నేతలు ఖండించారు. లంకేశ్‌ను హత్య చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌ డిమాండ్‌ చేశారు. ఈ హత్య వెనుక హిందూత్వ శక్తుల హస్తం ఉందన్నారు. ఇలాంటి శక్తులను కఠినంగా అణచివేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

Don't Miss