కేసీఆర్...వాట్ టుడు..వాట్ నాట్ టుడు..

15:24 - May 17, 2018

హైదరాబాద్ : కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు వేగంగా పావులు కదుపుతారని భావించిన కేసీఆర్‌... ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కర్నాటకలో రెండు జాతీయ పార్టీలే ఎక్కువ సంఖ్యలో స్థానాలు సాధించడంతో కేసీఆర్‌ ప్రయత్నాలు ఫలిస్తాయా? జాతీయ స్థాయిలో ప్రాంతీయపార్టీల హవా కొనసాగుతుందా? ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై కేసీఆర్‌ ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి? వాచ్‌ దిస్‌ టెన్‌ టీవీ స్పెషల్‌ స్టోరీ..

దేశ వ్యాప్తంగా కర్నాటక ఎన్నికలు ఆసక్తి రేపాయి. యావత్‌ దేశం కర్నాటక ఎన్నికలపై ఆసక్తిగా ఎదురు చూసింది. కానీ ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ మాత్రం రాలేదు. జాతీయ పార్టీలతోపాటు... ప్రాంతీయ పార్టీ హవా కొనసాగింది. జాతీయ పార్టీలకు ఆదరణ తగ్గుతుందన్న వాదనలో బలం లేదని కర్నాటక ఎన్నికలు తేల్చాయి. నేషనల్‌ పార్టీలోపాటు ప్రాంతీయ పార్టీలు సైతం సంబర పడేలా ఫలితాలు రావడం... రాజకీయ వర్గాల్లో భిన్నవాదనలకు తెరలేపుతున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఫ్రంట్‌ ఏర్పాటుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. కర్నాటక ఎన్నికల్లో వచ్చిన తీర్పుతో కేసీఆర్‌ ఏం చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జాతీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో మనుగడ ఉండదు. ప్రాంతీయ పార్టీలే కీరోల్‌ ప్లేచేస్తాయని కేసీఆర్‌ చెప్తూ వస్తున్నారు. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల్లో ప్రాంతీయ పార్టీతో పాటు జాతీయ పార్టీలకూ ప్రజల్లో ఆదరణ పెరిగింది. అయితే రెండు జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీపై చివరికి ఆధారపడాల్సిన పరిస్థితిని కల్పించేలా కన్నడ ప్రజలు తీర్పునిచ్చారు. జేడీఎస్‌ అక్కడ కింగ్‌మేకర్‌గా మారింది. ఆపార్టీ ఎవరికి మద్దతిస్తే వారే గద్దెనెక్కుతారు. లేదా తాను మద్దతు తీసుకుని సీఎం కుర్చీపై కూర్చొనే అవకాశముంది.

కర్నాటక ఎన్నికల ఫలితాలను టీఆర్‌ఎస్‌ నేతలు వెరైటీగా విశ్లేషిస్తున్నారు. ఎటొచ్చి ప్రాంతీయ పార్టీ అక్కడ కీరోల్‌గా మారిందని చెబుతున్నారు. కాబట్టి 2019 ఎన్నికల్లో దేశంలోనూ ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. పైగా కేసీఆర్‌ ఫ్రంట్‌లోకి జేడీఎస్‌ వస్తున్నట్టు చెప్తున్నారు. ఒకవేళ కన్నడలో జేడీఎస్‌కు అధికారం దక్కితే.. తమ ఫ్రంట్‌లో తొలి ప్రభుత్వం ఏర్పాటు అయినట్టు అవుతుందని చెబుతున్నారు. తమ నేత కేసీఆర్‌ రెట్టించిన ఉత్సాహంతో ఫ్రంట్‌ ఏర్పాటు చర్యలు ముమ్మ రం చేస్తారని చెబుతున్నారు. మొత్తానికి జాతీయ స్థాయిలో కేసీఆర్‌ ఏర్పాటు చేయనున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ పట్టాలెక్కుతుందా. దేశ రాజకీయాల్లో ముందడుగు వేస్తుందా. లేదా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Don't Miss