తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ...

21:20 - November 4, 2017

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల నుండే భక్తులు శివునికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. నాచారంలోని మహంకాళీ సహిత మహా కాళేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్తీక దీపాలు వెలిగించారు.

మేడ్చల్‌ జిల్లా కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నగర నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

నల్లగొండ జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున కార్తీక పూజలు నిర్వహించారు. జిల్లాలోని వాడపల్లిలో ఉదయం నుండే భక్తుల కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శివునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి కావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. పౌర్ణమికి ఒకరోజు ముందుగానే కొండకు చేరుకున్న భక్తులు ఉదయాన్నే విష్ణుపుష్కరినిలో స్నానాలాచరించి కార్తీక దీపాలు వెలిగించారు. సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో నారసింహుడి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. ఆలయంలో భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి భక్తులు ఉదయం నుండే పెద్ద సంఖ్యలో గోదావరి నదికి చేరుకొని పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం నరసింహ స్వామిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించి దీపదానాలు చేసి దీపాలు నదిలో వదలడం వలన సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. పట్టణంలోని ఓంకారేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండే భక్తుల రద్దీ కొనసాగింది. మహిళలు గోదుమ పిండితో తయారు చేసిన ప్రమిదలతో దీపాలను వెలిగించి స్వామివారిని కొలిచారు.

కృష్ణా జిల్లా, మచిలీపట్నం మంగినపూడి బీచ్ కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రుడికి హారతి ఇచ్చి సముద్ర స్నానాలను న్యాయశాఖా మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. విజయవాడ పవిత్ర కృష్ణా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

ఉభయ గోదావరి జిల్లాలో కార్తీక శోభ సంతరించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరాంపురంలో ఉన్న శ్రీ చక్రసహిత జగన్మాత కనకదుర్గాదేవి ఆలయంలో లక్ష దీపోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు కార్తీక దామోదరుడిని స్మరిస్తూ దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు. పాలకొల్లులోని రామలింగేశ్వర క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలం కోటిపల్లిలో శ్రీఛాయ సోమేశ్వర స్వామి ఆధ్వర్యంలో గోదావరి హారతి నిర్వహించారు. గోదావరి తీరాన సంస్కృతి కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

గుంటూరు జిల్లా నరసరావు పేటలోని కోటప్పకొండ ఆలయంలో శివనామస్మరణతో మారుమ్రోగింది. త్రికోటేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై కోటి దీపోత్సవ వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో సముద్ర స్నానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సముద్రతీరంలో ఇసుకతో శివలింగ ప్రతిమలు చేసి కార్తీక జ్యోతులను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆయా ప్రాంతాలన్నీ భక్త జనంతో కిక్కిరిసి పోయాయి. కార్తీక పౌర్ణమి కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు శివనామస్మరణతో భక్తి పారవశ్యన్ని చాటుకున్నారు. 

Don't Miss