సినీరంగంలో కరుణానిధి సిద్దహస్తుడు

07:40 - August 8, 2018

చెన్నై : ముత్తువేల్‌ కరుణానిధి...! వ్యూహదురంధర రాజకీయవేత్తగానే ప్రస్తుత తరానికి పరిచితుడు. కానీ.. ఆయన నవనీతంలాంటి మనసున్న కళావల్లభుడు... సాహిత్యరంగంలో చేయితిరిగిన రచయిత. అందుకే.. ఆయన్ను తమిళనాడు.. కళాకారుడు అన్న అర్థంలో... కలైజ్ఞర్‌గానే చివరిదాకా గౌరవించింది.  
తమిళ పరిశ్రమకు రచయితగా పరిచయమైన కరుణానిధి 
రాజకీయాల్లోకి రాకముందు కరుణానిది తమిళ సినీరంగంలో సిద్ధహస్తుడైన రచయితగా కొనసాగారు. అద్భుతమైన కథలు, నాటికలు, నవలలు రచించడం ద్వారా.. తమిళ సాహిత్య రంగానికీ తనవంతు సేవలు అందించారు. కరుణానిధి 1947లో రాజకుమారి అనే సినిమా ద్వారా తమిళ పరిశ్రమకు రచయితగా పరిచయం అయ్యారు. ఈ సినిమా సమయంలోనే కరుణానిధికి ఎంజీరామచంద్రన్‌ పరిచయమయ్యారు. అభిమన్యు, మరుదనాట్టు ఇళవరసి లాంటి ఎంజీఆర్‌ సినిమాలెన్నింటికో కరుణానిధి రచన అందించారు. కరుణానిధి సినీజీవితంలో చెరగని యశస్సును అందించిన సినిమాగా పరాశక్తిని చెప్పుకోవాలి. ద్రవిడ ఉద్యమ స్పూర్తిని రగిలించడమే కాదు.. బ్రాహ్మణవాదంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. 
వ్యంగ్య రచనలోనూ కరుణానిధి దిట్ట
పరాశక్తి ఇచ్చిన చైతన్యంతో.. అదే ఒరవడిలో పణం, తంగరత్నం సినిమాలకూ తనదైన శైలిలో రచన అందించి వివాదాలకు కారణమయ్యారు. వ్యంగ్య రచనలో కరుణానిధి దిట్ట. పైగా తన రచనల ద్వారా సమాజానికి ఆయన అందించే సందేశం ఆబాలగోపాలన్ని చేరింది. అదే కరుణానిధిని సుప్రసిద్ధ రాజకీయవేత్తగా రూపాంతరం చెందించింది. దీన్ని అవకాశంగా చేసుకుని.. కరుణానిధి... అన్నాదురైకి దన్నుగా.. సినిమా ద్వారా ద్రవిడ ఉద్యమవ్యాప్తి చేశారు. 
చివరిసారిగా పొన్నార్‌ శంకర్‌కు రచన అందించిన కరుణానిధి 
కరుణానిధి 2011 వరకూ తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. చారిత్రక చిత్రం పొన్నార్‌ శంకర్‌కు ఆయన చివరిసారిగా రచనను అందించారు. కరుణానిధి తమిళ సాహిత్యానికీ కరుణానిధి ఇతోధిక సేవను అందించారు. పద్యాలు, లేఖలు, స్క్రీన్‌ప్లేలు, నవలలు, ఆత్మకథలు, చారిత్రక నవలలు, డ్రామాలు, సినిమాలకు సంభాషణలు, పాటలు రాశారు. సమాజాన్ని చైతన్యపరిచిన తిరువళ్లువార్‌ అంటే.. కరుణానిధికి వల్లమాలిన అభిమానం. ఆయన రచించిన తిరుక్కురళ్‌కు కరుణానిధి వ్యాఖ్యానం రాశారు. ఆయన రచనల వ్యాప్తిని కాంక్షిస్తూ.. చెన్నైలో.. వళ్లువార్‌కొట్టం పేరిట.. తిరువళ్లువార్‌ 133 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. 

Don't Miss