పవన్‌, కత్తి ట్వీట్ల వివాదం మరో మలుపు

07:46 - January 9, 2018

హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌-కత్తి మహేష్‌ ట్వీట్ల వివాదం మరో మలుపు తిరిగింది. పూనమ్‌కౌర్‌పై కత్తి మహేష్‌ అనేక ప్రశ్నలు సంధించడం.. ఆమె పవన్‌కు ట్వీట్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వివాదం నుంచి తనను కాపాడాలని,.. మీరు స్పందిస్తేనే నా కెరీర్‌, ఫ్యామిలీ, మర్యాద దక్కుతుందని ఆమె ట్వీట్‌ చేయడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇన్నాళ్లు ట్వీట్ల వార్‌పై స్పందించాలని కత్తి మహేష్‌ కోరినా స్పందించని పవన్‌... ఇప్పుడు పూనమ్‌ ట్వీట్‌పై స్పందిస్తారా ? అనే ఉత్కంఠ అందరినీ వెంటాడుతోంది.
ఆరోపణలపై స్పందించిన పూనమ్‌కౌర్‌ 
పవన్‌కల్యాణ్‌ కత్తి మహేష్‌ ట్వీట్ల వార్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూనమ్‌కౌర్‌ స్పందించారు. తనపై కత్తి మహేష్‌ అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో... ఆమె పవన్‌కు ట్వీట్‌ చేయడం సంచలనం రేకెత్తింది. ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా మిమ్మల్ని ఎవరు రికమెండ్ చేశారు.? తిరుమలలో పవన్, మీరు ఒకే గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారా... లేదా...? పవన్ మిమ్మల్ని మోసం చేసాడని ఆత్మహత్యాయత్నం చేసింది నిజం కాదా..? అప్పుడు మిమ్మల్ని ఎవరు ఆసుపత్రికి తీసుకెళ్లారు? బిల్లు ఎవరు కట్టారు ? మీ అమ్మను కలిసిన పవన్,.. ఆవిడకు ఏం హామీ ఇచ్చారు? అది నెరవేరిందా..లేదా..? దర్శకుడు త్రివిక్రమ్ అంటే మీకెందుకు కోపం..? క్షుద్రమాంత్రికుడు నర్సింగ్ చేసిన తాంత్రిక పూజలో పవన్, త్రివిక్రమ్‌లతో పాటు మీరు అక్కడెందుకున్నారు అని కత్తి మహేష్‌ ఆరు ప్రశ్నలు పూనమ్‌కౌర్‌పై సంధించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమె స్పందించి... పవన్‌కు ఓ ట్వీట్‌ చేశారు. తనను ఈ వివాదం నుండి కాపాడాలని పవన్‌ను ఆమె ట్వీట్‌లో కోరారు. తాను రాజకీయంగా టార్గెట్‌ కాదల్చుకోలేదని... మీరు స్పందిస్తేనే నా కెరీర్‌, ఫ్యామిలీ, మర్యాద దక్కుతుందని పవన్‌ను వేడుకున్నారు. 
కత్తి మహేష్‌ ఆరోపణలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం 
కత్తి మహేష్‌ ఆరోపణలపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కత్తి మహేష్‌కు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. వ్యక్తిగతం, కుటుంబానికి సంబంధించిన అనేక ప్రశ్నలు వేస్తున్నారు. వీటిలో కత్తి మహేష్‌ తల్లికి సంబంధించినవి కూడా ఉన్నాయి. అయితే... వీటిపై కూడా పూనమ్‌ కౌర్‌ స్పందించారు. ఎవ‌రైనా కానీ, ఓ వ్యక్తి త‌ల్లిని కించ‌ప‌రుస్తూ మాట్లాడ‌కూడ‌దని ట్వీట్‌ చేశారు. ద‌య‌చేసి ఎవరూ కత్తి మహేష్‌ తల్లి గురించి మాట్లాడవద్దని వేడుకున్నారు. 
కత్తి మహేష్‌ ఆరోపణలపై స్పందించిన పూనమ్‌ సోదరుడు 
పూనమ్‌కౌర్‌పై కత్తి మహేష్‌ చేసిన ఆరోపణలపై ఆమె సోదరుడు శ్యాంసింగ్‌ స్పందించారు. తన సోదరికి ఏ దర్శకుడితో విభేదాలు లేవని... ఆ ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. నిఫ్ట్‌ చదివిన పూనమ్‌కు చేనేతపై పూర్తి అవగాహన ఉందని... అందుకే ఏపీ ప్రభుత్వం బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించిందన్నారు. తన సోదరిని అవమానించిన కత్తి మహేష్‌పై పరువు నష్టం దావా వేస్తానన్నారు శ్యాంసింగ్‌. గత కొంతకాలంగా ట్వీట్ల వివాదంపై స్పందించాలని కత్తి మహేష్‌ కోరుతుండగా.. ఎలాంటి స్పందన లేదు. అయితే... తాజాగా పూనమ్‌పై ఆరోపణలు... ఆమె పవన్‌కు ట్వీట్‌ చేసిన నేపథ్యంలో అజ్ఞాతవాసి ఎలా స్పందిస్తారోనన్న ఉత్కంఠ అందరినీ వెంటాడుతోంది. 

 

Don't Miss