14 స్థానాల్లో అభ్యర్థుల పెండింగ్...

08:46 - September 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితా  రాజకీయంగా సంచలనం రేపింది. ఒకే రోజు అసెంబ్లీని రద్దు చేయడం.. ఆ వెంటనే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం నిజంగా ఓ సాహసమే. కేసీఆర్‌ ప్రకటించిన 105 స్థానాల్లో 103 మంది సిట్టింగ్‌లే. కేవలం ఇద్దరు సిట్టింగ్‌లకు మాత్రమే టికెట్‌ దక్కలేదు.  మరో 14 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను కేసీఆర్‌ పెండింగ్‌లో ఉంచారు. వివిధ సర్వేల నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్టు కేసీఆర్‌ ప్రకటించారు.

అభ్యర్థులను ప్రకటించని నియోజకవర్గాలను పరిశీలిస్తే.. అక్కడ రాజకీయ సమీకరణలు కూడా ఆసక్త  రేపుతున్నాయి. సిట్టింగ్‌ శాసనసభ్యులతో పాటు... ప్రతిపక్ష పార్టీలకు చెందిన నియోజకవర్గాలు పెండింగ్‌ జాబితాలో ఉన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మెజార్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో ఉంది. బీజేపీ ప్రాతినిథ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాలైన అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌, గోషామహల్‌, ఖైరతాబాద్‌  స్థానాల్లో అభ్యర్థుల పోటీ కూడా టీఆర్‌ఎస్‌లో తీవ్రంగా ఉంది. అంబర్‌పేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎడ్ల సుధాకర్‌రెడ్డితోపాటు మాజీమంత్రి కృష్ణాయాదవ్‌ టిక్కెట్‌ కోసం పోటీ పడుతున్నారు.  మాజీ కార్పొరేటర్‌ కాలేరు వెంకటేష్‌ కూడా రేస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ముషీరాబాద్‌లో టిక్కెట్‌ కోసం ఇద్దరు నేతలు ప్రధానంగా పోటీపడుతున్నారు.  గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ముఠాగోపాల్‌ ఒకరైతే... హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అల్లుడు, రాంనగర్‌ కార్పొరేటర్‌ వి. శ్రీనివాస్‌రెడ్డి మరొకరు. ఇద్దరి మధ్య టిక్కెట్‌ కోసం పోటీ నెలకొంది. ఇక ఖైరతాబాద్‌ బరిలో నిలిపేందుకు విజయారెడ్డి, మన్నె గోవర్థన్‌రెడ్డితోపాటు విజయలక్ష్మి పేర్లను పార్టీ పరిశీలిస్తోంది. దానం నాగేందర్‌కు మాత్రం ఖైరతాబాదా లేక గోషామహల్‌ అన్నది అధిష్టానం లెక్కలేస్తోంది.  మరో మాజీమంత్రి ముఖేష్‌ కారెక్కితే... గోషాహల్‌ స్థానం ఆయనకే దక్కనున్నట్టు తెలుస్తోంది.  అయితే ఎంపీ మల్లారెడ్డి కూడా ఈ స్థానంపై  ఆశలు పెంచుకున్నారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో మైనంపల్లి హన్మంత్‌రావుతోపాటు.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వికారాబాద్‌లో మాజీమంత్రులైన ప్రసాద్‌కుమార్‌, ఏ. చంద్రశేఖర్‌లో ఎవరో ఒకరు కారెక్కుతారని.... వారికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం ఖారారయ్యే చాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. గులాబీబాస్‌ సమీకరణలు అన్ని పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. త్వరలోనే మంతనాలు ఓ కొలిక్కి వచ్చి.. అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉంచిన నియోజకవర్గాల్లో మహిళలకు ఎక్కువ మందికి అవకాశం కల్పించాలన్న  డిమాండ్‌ కూడా పార్టీలో వినిపిస్తోంది. మొత్తానికి గులాబీ బాస్‌ ఏ నిర్ణయం తీసుకుంటారు... ఎవరెవరికి ఎమ్మెల్యే టికెట్‌ బెర్త్‌లు దక్కుతాయన్నది ఉత్కంఠ రేపుతోంది.

 

Don't Miss