నంబినారాయణ్‌తో కేరళ సీఎం...

15:59 - October 10, 2018

తిరువనంతపురం : ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల చెక్కును అందచేశారు. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్(76) ను కేరళ పోలీసులు అనవసరంగా గూఢచర్యం కేసులో ఇరికించారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను వేధించినందుకు ఎనిమిది వారాల్లో రూ.50 లక్షలు పరిహారం చెల్లించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనితో ఆయన్ను కలిసి డబ్బును అందచేసింది. 

1994 నాటి గూఢచర్యం కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని, వేధించారని నంబి నారాయణన్(76) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనితో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నేతృత్వంలో జస్టిస్‌లు ఏఎం ఖాన్‌విల్కర్, డీవై చంద్రచూడ్‌తో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది.  విచారణ జరిపిన అనంతరం 1994నాటి కేసులో నంబి నారాయణన్ ను కేరళ పోలీసులు అనవసరంగా అరెస్టు చేశారని, దారుణంగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసలేం జరిగింది ? 
1994 అక్టోబర్ 20న కేరళలోని తిరువనంతపురంలో మాల్దీవులకు చెందిన మరియం రషీదా అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇస్రోకు చెందిన క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని రహస్యంగా సేకరించి పాకిస్థాన్‌కు అందచేస్తున్నట్లు పోలీసులు అభియోగాలు మోపారు. అదే ఏడాది నవంబర్‌లో ఇస్రోకు చెందిన క్రయోజెనిక్ ప్రాజెక్టు డైరెక్టర్ నంబి నారాయణ్, డిప్యూటీ డైరెక్టర్ డీ శశికుమారన్ లను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. నిరాధారమంటూ  పేర్కొంది. 

Don't Miss