కేరళలో దళిత పూజారులు...

20:42 - October 11, 2017

కేరళ : ఒట్టిమాటలు కట్టిపెట్టో..గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌ అన్నారు మహాకవి గురజాడ. నీతులు వల్లించడమే కాదు మంచిపనిని చేసి చూపెట్టాలి. తమది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని మరోసారి రుజువు చేస్తోంది.. కేరళలోని వామపక్ష  సర్కార్‌. సామాజిక న్యాయానికి పట్టంకడుతూ దళితులను దేవాలయాల్లో పూజారులుగా నియమిస్తోంది. ఇప్పటికే 150 ఏళ్ల చరిత్ర ఉన్న తిరువళ్ల మణప్పురం శివాలయానికి ప్రధాన అర్చకుడిగా ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ చరిత్రలో తొలి దళిత అర్చకుడిగా 22 ఏళ్ల యదు కృష్ణను నియమించారు.
పూజారులుగా దళితులు, బ్రాహ్మణేతరులు  
కేరళలోని వామపక్ష ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఇపుడు దేశవ్యాప్తంగా దళితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. దేవాలయంలోనికే ప్రవేశం లేని పరిస్థితుల నుంచి.. దళితులు ఇపుడు పూజారులుగా అడుగుపెడుతున్నారు. 
దళితులకు పూజార్లుగా టీడీబీ నిర్ణయం 
కేరళలోని ట్రావెన్‌కోర్‌ దేవసం బోర్డు తీసుకున్న నిర్ణయం దళితులకు పూజారులుగా అవకాశాన్ని కల్పిస్తోంది. కేరళ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన ఎగ్జామ్స్‌ ద్వారా ఈ పూజారుల ఎంపిక జరుగుతోంది. ప్రస్తుతం చేపడుతున్న నియామకాల్లో ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఆరుగురుతో సహా మొత్తం  36 మంది బ్రాహ్మణేతరులు నియామకం అవుతున్నట్టు  ట్రావెన్‌కోర్ దేవసం బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం దేవసం బోర్డు పరిధిలోని మొత్తం 1248 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయంకూడా ఉంది. దేవసం బోర్డు పరిధిలోని ఖాళీలు ఉన్నచోట వీరిని   పూజారులుగా నియమించనున్నారు. పూజారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా, రిజర్వేషన్ల అనుసారం ఉండాలని కేరళ దేవసం మంత్రి కడకంపల్లి రామచంద్రన్‌ అన్నారు. 
సామాజిక న్యాయానికి కేరళ ప్రభుత్వం దన్ను 
సామాజిక న్యాయం అంటూ నిత్యం ఎన్నో స్పీచ్‌లు దంచేసే నేతలకు కేరళలోని పినరయి విజయన్‌ ప్రభుత్వం మార్గదర్శకంగా నిలుస్తోంది. తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని మరోసారి సీఎం పినరయి విజయన్‌ నిరూపిస్తున్నారు. దళితులను దేవాలయాల్లో పూజారులుగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం ..ఇపుడు దేశవ్యాప్తంగా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం ఖాయమనే అభిప్రాయాలు వస్తున్నాయి.   

 

Don't Miss