మలయాళీల అభివృద్ధికి కృషి - పినరయి..

06:50 - March 20, 2017

హైదరాబాద్ : తెలంగాణలోని నాలుగున్నర లక్షల మంది మలయాళీల అభివృద్ధికి కృషి చేస్తానని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన విజయన్‌.. అనంతరం మలయాళీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. సీపీఎం నిర్వహించిన సమర సమ్మేళనం సభకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌ వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్‌.. మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలుసుకున్నారు. ప్రగతిభవన్‌కు వచ్చిన ఆయనకు కేసీఆర్‌ విందు ఇచ్చారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విజయన్‌ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ నుంచి శబరిమల వెళ్లే భక్తుల కోసం అక్కడ ఓ భవనాన్ని నిర్మించే అంశాన్ని కూడా కేసీఆర్‌.. విజయన్‌ దృష్టికి తెచ్చారు. దీనికి అవసరమైన భూమిని సమకూర్చుతామని విజయన్‌ హామీ ఇచ్చారు.

ఆత్మీయ సమ్మేళనం..
హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణమండపంలో జరిగిన మలయాళీల ఆత్మీయసమ్మేళనం కార్యక్రమంలో కేరళ సీఎం విజయన్ పాల్గొన్నారు. తెలంగాణలో ఉంటున్న నాలుగన్నర లక్షల మలయాళీల అభివృద్ధికి కృషి చేస్తానని విజయన్ తెలిపారు. కేరళ భవన్‌ను త్వరతగతిన పూర్తిచేయాలని.. హైదరాబాద్ నుంచి నేరుగా కేరళకు బస్సులు నడపాలని సీఎం కేసీఆర్‌ను కోరానని చెప్పారు. అలాగే కేరళ వాసులకు డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు కట్టించి ఇవ్వాలని కేసీఆర్‌ను కోరినట్టు తెలిపారు. మరోవైపు విజయన్ పర్యటన సమయంలో ఆర్టీసీ కళాభవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేరళ సీఎం గోబ్యాక్ అంటూ ఏబీవీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Don't Miss