ఖమ్మంలో వైద్యుల నిర్వాకం

09:18 - September 11, 2017

ఖమ్మం : ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది.. వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో... ప్రసవ వేదనతో వచ్చిన గర్భిణీ బల్లపైనే ప్రసవించింది.. బల్లపైనుంచి కిందపడిన శిశువు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణకు ఆదేశించారు.
వైద్యుల నిర్లక్ష్యం..శిశువు మృతి 
ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ గర్భిణీకి అంతులేని శోకం మిగిల్చింది... ఖమ్మం జిల్లా పల్లెగూడెంకు చెందిన నాగమణి నిండు గర్భిణి... ప్రసవ వేదనతో ఉన్న ఆమె... భర్త రాజయ్యతో కలిసి శనివారం రాత్రి ఆస్పత్రికి వచ్చింది.. నెలలు నిండలేదని చెప్పిన వైద్యులు... ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. వరండాలో విశ్రాంతి తీసుకోమని చెప్పారు.. నొప్పులు తీవ్రమై ఆమె బల్లపైనే ప్రసవించింది... బల్లపైనుంచి జారిపడి శిశువు మృత్యువాత పడ్డాడు.. 
బిడ్డ మృతితో దంపతులు కన్నీరుమున్నీరు
బిడ్డ మృతితో రాజయ్య దంపతులు కన్నీరుమున్నీరయ్యారు.. వైద్యుల నిర్లక్ష్యంవల్లే పసికందు మృతి చెందాడంటూ ఆందోళనకు దిగారు.. వీరికి మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి.. శిశువు మృతికి బాధ్యులైన డాక్టర్లపై చర్య తీసుకోవాలంటూ ఐద్వా ఆధ్వర్యంలో ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు.. అటు శిశువు మృతి విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఘటనపై పూర్తి వివరాలతో తనకు నివేదిక అందించాలని ఆదేశించారు.. మంత్రి ఆదేశాలతో కదిలిన వైద్యులు... ఈ ఘటనలో డాక్టర్ల తప్పేమీ లేదన్నట్లుగా నివేదిక మార్చారంటూ ఆరోపణలొస్తున్నాయి.. గర్భంలోనే శిశువు మృతి చెందిందంటూ డాక్టర్లు చెబుతున్నారు. శిశువు మృతి ఘటన సర్కారు ఆస్పత్రుల్లో వైద్యం పరిస్థితిని మరోసారి కళ్లకు కట్టింది.. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది.. 

Don't Miss