మావోలకు సమాచారమిచ్చింది కిడారి బంధువే ..

12:57 - October 2, 2018

విశాఖపట్నం : మావోయిస్టుల చేతిలో అంత్యంత కిరాతకంగా చంపబడ్డ ఎమ్మెల్యే కిడారి హత్యకు అత్యంత సన్నిహితుల వల్లనే జరిగిందని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నమ్మినవారే కిడారిని మావోల చేతికి అప్పగించారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కిడారికి అతి సన్నిహితుడిగా, విశ్వాసపాత్రుడిగా వ్యవహరించిన ఓ వ్యక్తి చేసిన నమ్మకద్రోహమే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టుల చేతికి చిక్కి, వారి చేతిలో హత్యకు గురికావడానికి కారణమైంది. ఆ వ్యక్తి కిడారిని బావా బావా.. అంటూ ఆప్యాయంగా పిలుస్తూనే ఆయన ప్రతి కదలికనూ మావోయిస్టులకు పక్కాగా చేరవేయడం గమనార్హం. విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు. అతని భార్య స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. అతడు సోమకు దగ్గరి బంధువవుతారని సమాచారం. అతనితో పాటు మరికొందరిని పావులుగా ఉపయోగించుకునే జంట హత్యల ప్రణాళికను మావోయిస్టులు పక్కాగా అమలుచేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఆ నాయకుడిది, కిడారిది వేర్వేరు గిరిజన తెగలైనా కిడారితో అతను  విశ్వసనీయంగా, చనువుగా ఉండేవాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గత నాలుగు రోజులుగా భార్యభర్తలు ఇద్దర్ని పోలీసులు వేర్వేరుగానూ, కలిపి ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టారు. వీరిరువురు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారని సమాచారం. జంట హత్యలకు రెక్కీ నిర్వహించే క్రమంలో రెండు, మూడు సార్లు లివిటిపుట్టు ప్రాంతంలో పర్యటించిన మావోయిస్టులకు అతనే ఆశ్రయమిచ్చినట్లు తెలిసింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో మావోయిస్టులు ఉన్నప్పుడు వారిని కలవడం, అక్కడికి సమీపంలోని కొందరు గ్రామస్థులతో ఆహారం సిద్ధం చేయించారని తెలిసింది. ఆహారం అందజేశారన్న అనుమానం ఉన్న వ్యక్తులను కూడా పోలీసులు పిలిచి విచారిస్తున్నారు. సర్రాయిలో గ్రామదర్శినికి కిడారి  అరకులో బయల్దేరారనే సమాచారం కూడా ఆ గ్రామస్థాయి నాయకుడి ద్వారానే మావోయిస్టులకు చేరిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అందుకు సంబంధించి కాల్‌ డేటా విశ్లేషణలోనూ కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.
 

Don't Miss