గుంటూరు వాసులకు నరకం

13:05 - September 13, 2017

గుంటూరు : ఇదీ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పరిస్థితి...ఓవైపు ప్రజా ప్రతినిధులు, అధికారుల ఆర్భాట ప్రకటనలు. మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం అమరావతి రాజధాని అభివృద్ధిని వెక్కిరిస్తున్నాయి. కాంట్రాక్టర్లపై నిఘాలేమి, అధికారుల సమన్వయ లోపం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గుంటూరు నగరంలో చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల తీరు..ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. గుంటూరు నగరానికి భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవటంతో పారిశుధ్య సమస్య తీవ్రమైంది. పీకల వాగు ద్వారా ప్రవహించే మురుగు నీరు నగరంలో పోటెత్తుతోంది. ఓపెన్ డ్రెయిన్స్ ఉండటంతో రహదారులపై మురుగునీరు పొంగిపోర్లుతోంది. దీంతో కంపుకొట్టే పరిసరాల మధ్య జనం జీవించాల్సిన దుస్థితి. ఇక అపరిశుభ్ర వాతావరణంతో దోమలు విజృంభించి విషజ్వరాలు ప్రబలుతున్నాయి.

2012లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు మంజూరు
అండర్ గ్రౌండ్ డ్రెయినేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ప్రజల నుంచి పెరిగిపోయింది. గుంటూరు నగరానికి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద కేంద్ర ప్రభుత్వం 2012లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టును మంజూరు చేసింది. పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు ఉన్న సమయంలో గుంటూరు కార్పొరేషన్‌లో యుజిడి పనుల కోసం వెయ్యి కోట్లు కేటాయించారు. గత ఏడాదే షాపూర్జీ పల్లోంజి కంపెనీ టెండర్లు దక్కించుకొని పనులు మొదలు పెట్టింది. స్థానిక ఎమ్మెల్యేలు గుంటూరులో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు ఘనంగా జనవరిలో శంకుస్థాపన చేశారు. ఏడాది క్రితమే పనులు ప్రారంభించాల్సి ఉండగా.. పలు కారణాలతో జాప్యం జరిగింది. 18 నెలల్లోనే ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని షాపూర్జీ, పల్లోంజీ ప్రకటించడంతో అధికారులు అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించారు. సుమారు వెయ్యి కిలో మీటర్ల మేర నగరమంతా భూగర్భ పైపు లైన్లు వేయాలని నిర్ణయించారు. లక్షా నలభై వేల గృహాలను పైప్ లైన్ల ద్వారా అనుసంధానించాలని నిశ్చయించారు.

గుంతలమయంగా గుంటూరు నగరం
తాగునీటి పైపు లైన్‌ పనులు ఓవైపు యుజిడి పనులు మరోవైపు జరగుతుండటంతో..గుంటూరు నగరం గుంతలమయంగా మారిపోయింది. అసలే వర్షాకాలం కావడంతో చినుకు పడిందంటే నగరం బురదమయంగా మారిపోతోంది. పలు ప్రాంతాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం గుంతలు తవ్వి అలాగే వదిలేశారు. దీంతో స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు..కాలినడకన వెళ్లాలన్నా ఎక్కడ జారిపడిపోతామోనన్న భయంతో వణికిపోతున్నారు. ఏ పనిమీద బయటికెళ్లాలన్నా వారికి పాట్లు తప్పడం లేదు. యుజిడి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లను, నగరపాలక సంస్థ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇష్టారాజ్యంగా రహదారులు తవ్వేసి వెళ్తే రాకపోకలు ఎలా సాగించాలని ప్రశ్నిస్తున్నారు.

Don't Miss