నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది కొరత

16:43 - August 29, 2017

నిజామాబాద్‌ : జిల్లా ప్రభుత్వాస్పత్రిని సిబ్బంది కొరత వేధిస్తోంది. రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసినా ఫలితం నీరుగారిపోతోంది. రోజు రోజుకీ ఆస్పత్రిలో రోగుల తాకిడి ఎక్కువైపోతుండడంతో తగిన సిబ్బంది లేక,  ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. 
ఆస్పత్రిలో సిబ్బందిలేమితో రోగుల ఇబ్బందులు
నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలన్న ప్రభుత్వం ఆశలు అడయాశలవుతున్నాయి. వైద్యసేవల కోసం కోట్లు ఖర్చు చేసినప్పటికినీ ఫలితం మాత్రం శూన్యం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుండి ఆరోగ్య మంత్రిల వరకు హామీల వర్షం కురిపించినా ఆస్పత్రిలో సిబ్బంది కొరత మాత్రం తీరడంలేదు. ఏడంతస్తుల భవనంలో మెరుగైన సేవలందక రోగులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రైవేటు వైద్యులతో సేవలు
ఆస్పత్రికి అభివృద్ధి కమిటీ ఉన్నప్పటికీ రెగ్యులర్‌గా సమీక్షా, సమావేశాలు నిర్వహించడంలేదు. టీచింగ్‌ ఆస్పత్రిగా ఉన్నప్పటికీ వైద్యులను మాత్రం నియమించడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల నుండి వైద్యులను పిలిపించి సేవలు అందించాల్సిన దుస్తితి నెలకొంది. ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న వైద్య కళాశాల ప్రారంభమై నాలుగు సంవత్సరాలు దాటినా కళాశాలకు అనుబంధంగా జిల్లా కేంద్ర ఆస్పత్రికి మార్చారు. ఈ ఆస్పత్రిలో ఐదువందలున్న పడకలను 750కి పెంచారు. 250 కోట్లకు పైగా వెచ్చించి వైద్య కళాశాల భవనాలు, ఆస్పత్రి కోసం ఏడంతస్తుల మేడను కట్టారు. రోగులకు మెరుగైన వసతులు కల్పించారు.
ఆస్పత్రిలో వందల సంఖ్యలో ఖాళీలు
నిత్యం 1200లకు పైగా ఔట్ పేషెంట్లతో ఆస్పత్రి ప్రాంగణం కిటికిటలాడుతుంటుంది. ప్రతి నెల కనీసం 750కి పైగా ప్రసవాలు జరుగుతుంటాయి. రోగుల తాకిడితో ఆస్పత్రిలో ఉన్న 500 పడకలు సరిపోవడంలేదు. ఇంత పెద్ద ఆస్పత్రిలో అన్ని విభాగాలలోనూ వందల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. కీలక విభాగమైన రేడియోలజీలో మూడు నెలల నుండి సిబ్బంది లేరు. ప్రతి రోజు ప్రైవేటు ఆస్పత్రి వైద్యులను పిలిపించి పరీక్షలు చేయిస్తున్నారు. వీరికి ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుండి చెల్లింపులు చేస్తున్నారు. సిటీ స్కాన్‌, ఎక్స్‌రే యూనిట్‌తో పాటు ఇతర విభాగాలలో టెక్నీషియన్లు లేక రోగులను బయటికి పంపుతున్నారు. టెస్టులకు అయ్యే ఖర్చులను పేద రోగులకు ఆస్పత్రి నిధుల నుండి కేటాయిస్తున్నారు. ప్రభుత్వ మందులకు కొదువ లేకుండా చేస్తున్నప్పటికీ రోగుల పరీక్షలకు మాత్రం ఇబ్బందులు పడకతప్పడంలేదు. ఓ వైపు ప్రభుత్వ ఆస్పత్రి దుస్తితిపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఆస్పత్రి సిబ్బందిని నియమించి ప్రజలకు వైద్య సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. 
ఆస్పత్రిలో లేని క్యాంటిన్‌ సదుపాయం
నెలకు 30వేలకు పైగా వచ్చే ఈ ఆస్పత్రిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి అభివృద్ధి కమిటీ సమావేశం కావాలి. జెడ్పి చైర్మన్‌ ఈ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. ఆయనతో పాటు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్‌, జీవన్‌ రెడ్డిలతో పాటు కలెక్టర్‌, సూపరిండెంట్‌ ఆస్పత్రి కమిటీ సభ్యులుగా ఉన్నారు.  ఈ ఆస్పత్రిలో కనీసం రోగులకు ఉపయోగపడే విధంగా క్యాంటీన్‌ కూడా లేదు. అత్యవసర మందుల కోసం కూడా రోగులకు ఇబ్బంది పడక తప్పడంలేదు.  
ఇంకా కోర్సులకు మోక్షం లభించలేదు 
అయితే మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాలకు అనుగుణంగా ఆస్పత్రిలోని ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం నోటిఫికేషన్లు జారీ చేసినా ఇంకా కోర్సులకు మోక్షం లభించలేదు. ఆస్పత్రిలో మొత్తం 26 మంది ప్రొఫెసర్లు వివిధ విభాగాలలో పని చేయాలి, కాని ప్రస్తుతం 10 మంది ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. 26 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఉండాలి, కాని 12 మంది మాత్రమే ఉన్నారు. ఈ ఆస్పత్రికి అనుభందంగా ఉన్న కళాశాలతో కలిపి మొత్తం 51 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి, కాని కేవలం 21 మంది మాత్రమే ఉన్నారు. కీలకమైన జనరల్‌ మెడిసిన్‌లో మూడు పోస్టులకు కలిపి ఒక్కరే ఉన్నారు. అసోసియేట్‌లు అసలే లేరు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు నలుగురు మాత్రమే ఉన్నారు. సర్జరీలో అసోసియేట్‌ ప్రొఫెసర్లు ముగ్గురు ఉండాల్సింది కాని ఒక్కరు కూడా లేరు. అసిస్టెంట్‌లు నలుగురు మాత్రమే ఉన్నారు. అనిస్తిషియాలో ఉండాల్సిన మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా లేరు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఆరుగురు ఉండాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ రోగులకు కావల్సిన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నారు. రోజు రోజుకీ ఆస్పత్రిలో రోగుల తాకిడి పెరిగిపోతున్నందున సిబ్బంది కొరతతో ఇబ్బంది పడే పరిస్తితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. 

Don't Miss