సర్వాంగ సుందరంగా ముస్తాబైన లకారం చెరువు

07:14 - February 11, 2018

ఖమ్మం : టౌన్‌లోని.. లకారం చెరువు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పుడీ చెరువుకట్ట.. నగరానికి మణిహారంలా భాసిల్లుతోంది. ఆహ్లాదం పంచుతోన్న పచ్చందనాల లకారం ట్యాంక్‌బండ్‌ను ఆదివారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తోంది.

ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో లకారం చెరువు సుందరీకరణ పనులు పూర్తైయ్యాయి.. ట్యాంక్ బాండ్ పై వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హట్స్... పాదచారుల కోసం పుట్ పాత్... వాకింగ్ ట్రాక్‌లు... లకారానికి కొత్తఅందాలు తెచ్చి పెట్టాయి. ట్యాంక్ బండ్‌కు ఇరువైపులా నీటి గలగలలు మరోవైపు లాన్‌.. సందర్శకులను ఆహ్లాదపరుస్తున్నాయి.. ఇక్కడ ఏర్పాటు చేసిన బోటింగ్ ఆబాలగోపాలన్ని అలరించనుంది. ఇక లకారంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులు..  సందర్శకుల్లో కొత్త ఉత్సహం నింపుతోంది.. 

మిషన్‌ కాకతీయలో భాగంగా ప్రభుత్వం.. లకారం చెరువును సుందరీకరించింది. 150 ఎకరాల ఈ చెరువు.. కబ్జాదారుల కోరలకు చిక్కి.. 90 ఎకరాలకు చేరింది.  అదికూడా.. చెత్తా చెదారంతో, మురికి కంపు కొడుతూ ఉండేది. నగరవాసులకు ఆహ్లాద పరిచే ప్రదేశాలు లేకపోవడాన్ని గుర్తించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక శాసనసభ్యుడు పువ్వాడ అజయ్ కుమార్ లకారం చెరువుకు కొత్త శోభను తీసుకు వచ్చారు.. ఆరు కోట్ల రూపాయల వ్యయపు అంచనాతో ప్రారంభించిన లకారం సుందరీకరణ పనులు.. పాతిక కోట్లకు చేరాయి. ఆదివారం నాడు.. రాష్ట్ర్ర మంత్రులు హరీష్ రావు. తుమ్మల నాగేశ్వరావులు 5కే రన్ నిర్వహించి ఈ ట్యాంక్‌బండ్‌ను ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. ఈనెల 11 న మూవీ ఆర్టిస్ట్స్‌ ఆధ్వర్యంలో.. 5కే రన్ నిర్వహించనున్నారు. లకారం చెరువు అభివృద్ధి పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Don't Miss