ఇక చెరువుల నిర్మాణాలకు భూ సేకరణ...

06:24 - December 7, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా చెరువుల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిషన్ కాకతీయ నాలుగో దశకింద ఆదిలాబాద్‌లో 26, మెదక్‌లో 8 కొత్త చెరువుల నిర్మాణం చేపట్టనున్నారు. మిషన్ కాకతీయ పథకం కింద పాత చెరువుల పునరుద్ధరణతోపాటు కొత్త చెరువులను నిర్మించనున్నారు. ఈ పథకం నాల్గో దశలో కొత్త చెరువుల నిర్మాణాన్ని చేపడుతున్నట్టు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా 26 చెరువుల తవ్వకానికి అనుమతులతో పాటు.. నిధులు మంజూరు చేసినట్టు నీటిపారుదల శాఖ మంత్రి పేర్కొన్నారు.

ఈ పథకం కింద ఉమ్మడి మెదక్ జిల్లాలో కంగ్టి మండలం సుకల్ తీర్థ్ గ్రామంలో కొత్తగా కాకివాగు చెరువును నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వంద ఎకరాలకు పైగా భూమిని సేకరించనుంది. అలాగే ఇర్కపల్లి గ్రామంలోనూ కొత్త చెరువుకోసం 96 ఎకరాలు, కేశ్వర్ గ్రామంలో వంద ఎకరాలు, ఊటపల్లి గ్రామంలో 285 ఎకరాల భూమి, ఎస్గి గ్రామంలో 72 ఎకరాలను ప్రభుత్వం సేకరించనుంది. నారాయణఖేడ్ మండలం జగన్నాధపూర్ గ్రామంలోనూ భూసేకరణకు చర్యలు తీసుకోనున్నారు. ఈ కొత్త చెరువుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరిగతగిన పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులకు, మూడు జిల్లాల కలెక్టర్లకు, ఇంజినీర్లకు మంత్రి హరీష్ విజ్ఞప్తి చేశారు. 

Don't Miss