మాదాల రంగారావు ఆదర్శ ప్రాయుడు

19:58 - June 6, 2018

హైదరాబాద్ : చిత్ర రంగంలోకి అడుగు పెట్టినా.. కమ్యూనిస్టు ఉద్యమాలను కొనసాగించిన మాదాల రంగారావు.. నేటి తరానికి ఆదర్శ ప్రాయుడని ప్రముఖ నటులు, వామపక్ష నేతలు కొనియాడారు. తుదిశ్వాస వరకూ కమ్యూనిస్టు ఉద్యమాల పునరేకత గురించే తపించారని స్మరించుకున్నారు. 
మాదాల సంస్మరణ సభ 
ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు సంస్మరణ సభ హైదరాబాద్‌లో .... ఘనంగా జరిగింది. ప్రముఖ సినీ నటులు, రాజకీయ నాయకులు ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదాలతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  
కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని లోటు 
మాదాల మృతి కళా రంగానికే కాదు కమ్యూనిస్టు ఉద్యమానికే తీరని లోటని నేతలు అన్నారు. ఎర్ర జెండాని వెండితెరపై రెపరెపలాడించిన నాయకుడని కొనియాడారు. చివరి వరకు కమ్యూనిస్టు ఉద్యమాల పునరేకత గురించి మాదాల ఆలోచించేవారని గుర్తు చేసుకున్నారు. 
తెలుగు సినిమాల ద్వారా వామపక్ష ఉద్యమం 
అద్భుతమైన నటతో వామపక్ష ఉద్యమాన్ని తెలుగు సినిమాల ద్వారా ప్రజలకు పరిచయం చేశారని నటులు మురళి మోహన్‌, బ్రహ్మానందం అన్నారు. వామపక్ష రాజకీయాలను దేశ ప్రజలలో ప్రభావితం చేసేందుకు మాదాల కృషి చేశారన్నారు. ఈ తరం వారు స్మరించుకోదగ్గ నటుడు మాదాల రంగారావు అని కొనియాడారు. 
ఎర్రజెండా బావుటాను నింగికెగరేసిన మహానుభావుడు మాదాల 
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎర్రజెండా బావుటాను నింగికెగరేసిన మహానుభావుడు మాదాల అని కొనియాడారు నటుడు నారాయణ మూర్తి. వామపక్ష రాజకీయాలను సినీ రంగం ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు ప్రయత్నం చేశారన్నారు.. 
వామపక్షపార్టీలు ఒక్కటి కావాలని ఆకాంక్షించిన మాదాల
వామపక్షపార్టీలు ఒక్కటి కావాలని మాదాల ఆకాంక్షించేవారని సీపీఐ తెలంగాణ ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.. ఆయన ఆకాంక్షకు అనుగుణంగానే తమ వైఖరి కూడా ఉందన్నారు.  మాదాల రంగారావు తన జీవితాంతం సమాజ హితం కోసం పనిచేశారని తెలంగాణ టీడీపీ నాయకులు ఎల్‌. రమణ గుర్తు చేసుకున్నారు. వామపక్ష ఉద్యమాన్ని తెలుగు చిత్రాలతో ప్రజలకు తెలిసేలా కృషి చేసి మాదాల రంగారావు ఎనలేని కృషి చేశారని స్మరించుకున్నారు నేతలు. 

 

Don't Miss