సింగరేణి భవన్‌ముందు వామపక్షాల ధర్నా

21:24 - May 18, 2017

హైదరాబాద్‌: నగరంలోని సింగరేణి భవన్‌ నినాదాలతో హోరెత్తింది.. తాడిచెర్ల గనులను ప్రైవేటీకరించొద్దంటూ వామపక్షాలు, ట్రేడ్‌ యూనియన్ల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.. ఈ ఆందోళనలో సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, ట్రేడ్‌ యూనియన్‌ నేతలు పాల్గొన్నారు..

వైఎస్‌ఆర్‌, రోశయ్య హయాంలోనూ...

వైఎస్‌ఆర్‌, రోశయ్య హయాంలోనూ గనులను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నించారని చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాల పోరాటంవల్లే వెనక్కితగ్గిన రోశయ్య... పీఎల్‌ఆర్‌కు ఇచ్చిన తాడిచర్ల కోల్‌బ్లాక్‌ టెండర్లను రద్దుచేసి సింగరేణికి అప్పజెప్పాలంటూ ఆదేశించారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ కూడా తాము అధికారంలోకి వస్తే సింగరేణిని ప్రభుత్వం తరపున స్వంతంగా నిర్వహిస్తామంటూ హామీ ఇచ్చిందని .. ఇప్పుడు ఆమాట తప్పిందని చాడ విమర్శించారు.. సింగరేణితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేసి ఏఎమ్‌ఆర్‌ కంపెనీకి ఇవ్వాలని చూస్తోందని ఆరోపించారు..

అధికారంలోకి రాగానే ఆ సంస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని....

ఎన్నికలకు ముందు సింగరేణి జపం చేసిన సీఎం కేసీఆర్‌... అధికారంలోకి రాగానే ఆ సంస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మండిపడ్డారు.. ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగులతో పాటు నిరుద్యోగులకూ భారీగా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి తాడిచెర్ల బొగ్గు గనుల ప్రైవేటీకరణపై వామపక్షాలు కదం తొక్కాయి.. గనుల్ని ప్రైవేటుపరం చేయొద్దంటూ సీఎస్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. 

Don't Miss