లెఫ్ట్ నేతలతో జనసేనానీ...

21:18 - April 6, 2018

విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జనసేన, వామపక్షాలు నిర్ణయించాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలతో పాటు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ మెడలు వంచి హోదా సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని విజయవాడలో జరిగిన పాదయాత్ర సందర్భంగా జనసేన, వామపక్షాల నేతలు నిర్ణయించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం.. జనసేన, వామపక్ష పార్టీలు పాదయాత్రను చేపట్టాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణల సారథ్యంలో.. మూడు పార్టీల కార్యకర్తలు ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్ర స్పూర్తితో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హోదా విషయంలో చేసిన నమ్మకద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని జనసేన, వామపక్షాలు నిర్ణయించాయి.

బెజవాడ బెంజిసర్కిల్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్రలో పవన్‌ కల్యాణ్‌తోపాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణతోపాటు మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బెంజి సర్కిల్‌ నుంచి జాతీయరహదారి మీదుగా రామవరప్పాడు వరకు పాదయాత్ర సాగింది. భారీగా తరలివచ్చిన మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానుల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపించింది. మండువేసవి ఉక్కబోత వాతావరణంతో పవన్‌ కల్యాణ్‌, మధు, రాకమృష్ణ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. నేతల చొక్కలు తడిపోయాయి. దీంతో ఉక్కబోతను తట్టుకోలేదు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు చొక్కా విప్పారు. పవన్‌ కల్యాణ్‌ ఈ చొక్కను తన చేత పట్టుకుని.. మధుతో పాటు ముందుకు సాగడం కమ్యూనిస్టుల పట్ల పవన్‌ అభిమానానికి నిదర్శనంగా నిలిచిందని.. చూసినవారు వ్యాఖ్యానించారు.

హోదా ఉద్యమంలో భాగంగా మరో మూడు పాదయాత్రలు నిర్వహించాలని జనసేన, వామపక్షాలు నిర్ణయించాయి. ఈనెల 15న అనంతపురం, ఏప్రిల్‌ 24న ఒంగోలు, మే 6న విజయనగరంలో పాదయాత్ర నిర్వహిస్తారు. వ్యక్తిగత స్వార్థం కోసం అధికార టీడీపీ, విపక్ష వైసీపీ హోదాను తాకట్టు పెట్టాయని పాదయాత్ర అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్‌ మండిపడ్డారు. హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నిర్వహించే అఖిలపక్ష సమావేశంతో ఎలాంటి ప్రయోజనంలేదని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. హోదా సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రకటించారు. ప్రధాని మోదీ మెడలు వంచి హోదా ఇచ్చి, విభజన హామీలు అమలు చేసేవరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. అధికార టీడీపీ కానీ, ప్రతిపక్ష వైసీపీ కానీ హోదా ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడంతో... ప్రస్తుత తరం నష్టపోయే పరిస్థితి వచ్చిందని జనసేన, వాపమక్ష నేతలు ఆక్షేపించారు. ప్రభుత్వాధినేతలో చిత్తశుద్ధి కనిపించేవరకూ.. ఆయన నేతృత్వంలోని అఖిలపక్షాలకు హాజరు కాబోమని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. 

Don't Miss