కేంద్రం తీరుపై కామ్రెడ్ల కన్నెర్ర

22:14 - February 3, 2018

హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ.. ఈ నెల 8న రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. విభజన చట్టంలోని హామీల్లో ఏ ఒక్కదానికీ బడ్జెట్‌లో కేటాయింపులు జరపలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి, పెరుగుతున్న నిరుద్యోగానికి ఉపశమనం కలిగే చర్యలేవీ బడ్జెట్‌లో తీసుకోలేదన్నారు. 8వ తేదీన తలపెట్టిన బంద్‌కు  వర్తక, వాణిజ్య సంఘాలు, విద్యార్థి, యువజన, రైతు, కార్మిక సంఘాలు మద్దతు తెలిపి జయప్రదం చేయాలని మధు కోరారు. 
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం..
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం.. విభజన చట్టంలోని హామీలన్నీ తూచ్‌.. కేంద్రం తీరుపై కామ్రెడ్ల కన్నెర్ర...ఈ నెల 8న రాష్ట్ర బంద్‌కు పిలుపు.... కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 8వ తేదీన రాష్ట్రబంద్‌కు వామపక్షాలు పిలుపునిచ్చాయి. అమరావతిలోని కాట్రగడ్డ శ్రీనివాసరావుభవన్‌లో లిబరేషన్‌ నాయకులు డి.హరినాథ్‌ అధ్యక్షతన వామపక్ష నేతలు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌, అనంతర తాజా పరిణామాల్ని నేతలు సమీక్షించారు. మన రాష్ట్రానికి బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని, లోటుబడ్జెట్‌ భర్తీగానీ, రైల్వేజోన్‌, కడపకు ఉక్కు పరిశ్రమ, రాజధానికి నిధులు, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు కేటాయింపులు గానీ చేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి, పెరుగుతున్న నిరుద్యోగానికి ఉపశమనం కలిగే చర్యలేవీ బడ్జెట్‌లో తీసుకోలేదన్నారు. ఇది అన్నివర్గాల ప్రజలకు అన్యాయం చేయడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు మాత్రం రాయితీలు ప్రకటించిందని మండిపడ్డారు. ఈ నెల 8న నిర్వహించే బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని మధు విజ్ఞప్తి చేశారు. 
వామపక్షాల బంద్‌కు కాంగ్రెస్‌ మద్దతు 
అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు బంద్‌లో కలిసి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌,.. పవన్‌కల్యాణ్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 8వ తేదీన వామపక్షాలు తలపెట్టిన బంద్‌కు కాంగ్రెస్‌ సైతం మద్దతు తెలిపింది. అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు సహకరించాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కోరారు. వర్తక, వాణిజ్య సంఘాలు, విద్యార్థి, యువజన, రైతు, కార్మిక సంఘాలు 8వ తేదీ తలపెట్టిన బంద్‌ను జయప్రదం చేయాలని లెఫ్ట్‌పార్టీలు కోరుతున్నాయి. వామపక్షాల ఉద్యమంతోనైనా కేంద్రం దిగివచ్చి.. ఏపీకి నిధులు కేటాయిస్తుందో చూడాలి. 

Don't Miss