దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న గంగిరెద్దుల వాళ్లు

16:31 - January 12, 2017

హైదరాబాద్: గంగిరెద్దులను అందంగా ముస్తాబు చేసి ఇంటిముంగిటకు తీసుకొచ్చి ఆటలాడించి అందరినీ ఓలలాడించే గంగిరెద్దుల వృత్తి కళాకారుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి.. ఆ వృత్తికి ఆదరణ లేకుండా పోయింది. సంచార జీవనం గడిపే వారికి సొంత ఇల్లు, స్థిరాస్తి లాంటివి లేవు. సమాజంలో వారికి గుర్తింపు లేకుండా పోయింది. కుల కట్టుబాట్లు మరింత కుంగదీస్తున్నాయి. గంగిరెద్దు వృత్తిదార్లు చదువు రాకపోయినా సమయస్ఫూర్తితో మాట్లాడి మెప్పించగలరు. ప్రమాదమని తెలిసినా ఎటువంటి సెట్టింగులు లేకుండా గంగిరెద్దుతో విన్యాసాలు చేయించి అందరినీ ఆశ్యర్యపర్చేలా నిలబెట్టుతారు. అబ్బురపరిచే గంగిరెద్దుల విన్యాసాలు చూడటానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తీ కాదు..

అన్ని రంగాలపై గ్లోబలైజేషన్ ప్రభావం....

అన్ని రంగాలపై గ్లోబలైజేషన్ ప్రభావం పడినట్లు గంగిరెద్దుల వాళ్లపై పట్టణీకరణ ప్రభావం పడింది. గతంలో లాగా గ్రామాలలో గ్రాసం రాక బయట వేరే వృత్తులలోకి వెళ్లకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వృత్తి క్రమంగా కనుమరుగై ఇతర పనులకు మళ్లిపోతున్నారు. విశాఖ జిల్లాలో దాదాపు మూడు వేల వరకు గంగిరెద్దుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వృత్తిని నమ్ముకొని బతుకుతున్న దాదాపు ఆరు వేల కుటుంబాలకు జీవనోపాధి దెబ్బతిన్నది. ప్రభుత్వం నుంచి సరైన ఆదరణలేక, ప్రోత్సాహం ఇవ్వక నానా అవస్థలు పడుతున్నారు. సంచారజాతులుగా జీవనం సాగిస్తున్న ఆ కళాకారులకు రక్షణ కరువైంది. వృత్తిలేక, ఉపాధిలేక, ఆదుకొనే నాధుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జానపదకళలకు రక్షణ కల్పించాల్సిందిపోయి తిండిపెట్టే వృత్తి కనుమరుగవుతున్నా పట్టించుకొని దుస్థితి ఏర్పడింది.

500 కుటుంబాలు గంగిరెద్దుల వృత్తిపై జీవనం...

విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతంలో ముద్దుర్తి, లంకెలపాలెం, సబ్బవరం, మల్లునాయుడుపాలెం, చోడవరం, పెద్దబోడేపల్లి, మామిడిపాలెం, కె.కోటపాడు, వేపగుంట తదితర గ్రామాల్లో దాదాపు 500 కుటుంబాలు గంగిరెద్దుల వృత్తిపై జీవనం సాగిస్తున్నాయి. ఏడాదిలో సంక్రాంతి రోజుల్లో తప్ప ఇతర రోజుల్లో వీరికి ఆదరణ లేక కూలీ పనులకు వెళ్తుంటారు. పట్ణణాలు, గ్రామాలకు విసిరిపడేసినట్లు దూరంగా పాకలు వేసుకొని గంగిరెద్దును తిప్పుకొనే వారికి ఇప్పుడు స్థిర నివాస స్థలాల్లేవు. గంగిరెద్దులను మేపుకొనేందుకు కాసింత స్థలమూలేదు. గంగిరెద్దులను పోషించుకోలేక ఆ వృత్తిని విడిచి ప్లాస్టిక్‌, సిల్వర్‌ సామాన్లు అమ్ముకొని జీవిస్తున్నారు. పనులు, వ్యాపారం చేసే శక్తిలేని వారు భిక్షాటన చేసుకొని బతుకు వెళ్లదీస్తున్నారు. అత్యంత వెనుకబడిన తమను ఎస్‌టి జాబితాలో చేర్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఉన్నత తరగతికి చెందిన బి.సి(ఎ)లో చేర్చి ఎదగనీయకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైన ప్రభుత్వం తమను అదుకోవాలని....

ఇప్పటికైన ప్రభుత్వం తమను అదుకోవాలని ధీనంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమను ఎస్టీలలో చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమలో చదువుకున్న యువకులకు భవిష్యత్ అందంగా మారుతుందన్నారు. లోన్లు రాక సొంత వ్యాపారాలు ఏవైనా చెసుకునే పరిస్థితి లేక దిక్కు తోచక ఇదే వృత్తిలో కొనసాగుతున్నామంటున్నారు.

Don't Miss