నెల రోజుల్లో మళ్లీ మంత్రివర్గ విస్తరణా..?

21:41 - September 3, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల టీంను ఏర్పాటు చేసుకున్నారు. మంత్రివర్గ పునర్వస్థీకరణలో కొత్తగా తొమ్మిది మందికి స్థానం కల్పించారు. మరో నలుగురికి కేబినెట్‌ హోదా ఇచ్చారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొత్త మంత్రులతో ప్రమాణం చేశారు. ముందుగా సహాయ మంత్రుల నుంచి పదోతన్నతి పొందిన ధర్మేంద్ర ప్రధాన్‌, పియూష్‌ గోయల్‌, నిర్మాలా సీతారామన్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.ఆ తర్వాత తొమ్మిది మంది కొత్త మంత్రులతో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. బీహార్‌కు అశ్వినీకుమార్‌, రాజ్‌కుమార్‌సింగ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్న శివప్రతాప్‌ శుక్లా, మధ్యప్రదేశ్‌కు చెందిన వీరేంద్రకుమార్‌ సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. కర్నాటక నుంచి అనంతకుమార్‌ హెగ్డే, రాజస్థాన్‌ కు చెందిన గజేంద్ర సింగ్‌ షెకావత్‌, యూపీ నుంచి సత్యపాల్‌ సింగ్‌, కేరళకు చెందిన అల్ఫోన్స్‌ కన్నన్‌థానన్‌లను మంత్రివర్గంలో స్థానం కల్పించారు. తొమ్మిది మంది కొత్త మంత్రులకు సహాయ మంత్రుల హోదా కల్పించారు. కొత్త మంత్రుల్లో నలుగురు అఖిల భారత సర్వీస్‌ అధికారులు ఉన్నారు. ఆర్కే సింగ్‌, అల్ఫోన్స్‌ కన్నన్‌థానన్‌ రిటైరైన ఐఏఎస్‌ అధికారులు. సత్యపాల్‌సింగ్‌ రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ కాగా, హర్దీప్‌సింగ్‌ పూరీ రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి.

2019లో లోక్‌సభకు ఎన్నికలు
మరో రెండు నెలల్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. 2019లో లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయి. ఈ అన్ని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వస్థీకరించారు. అయితే పునర్వవస్థీకరణలో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపించారు. ఏపీ నుంచి విశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు, తెలంగాణ నుంచి కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్‌కు మోదీ మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ప్రచారం జరిగింది. కుటుంబంతో సహా రావాలని ఆదేశించడంతో ఢిల్లీ చేరకున్న కంభంపాటి హరిబాబుకు తీవ్ర నిరాశే ఎదురైంది. తెలంగాణ నుంచి సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ స్థానంలో ఎవరికీ మంత్రివర్గంలో చోటు దక్కలేదు.

తెలుగు రాష్ట్రాలకు మెండిచేయి
బీహార్‌లో అధికారంలో ఉన్న జేడీయూతోపాటు తమినాడు అధికార పార్టీ అన్నా డీఎంకే, మహారాష్ట్రలో బీజేపీతో కలిసి అధికారం పంచుకుంటున్న శివసేనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. నెల రోజుల్లో మరోసారి విస్తరణ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్పుడు జేడీయూ, అన్నా డీఎంకే, శివసేన పార్టీలతోపాటు తెలుగు రాష్ట్రాలకు చోటు కల్పించొచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. 

Don't Miss