ఊహించని విధంగా మంత్రిపదవులు

21:43 - September 3, 2017

ఢిల్లీ : కేంద్రంలో కేబినెట్‌లోకి కొత్తనీరు వచ్చిచేరింది. కొందరిశాఖల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా కొందరికి కీలక శాఖలు దక్కాయి. నిన్నటివరకు కామర్స్‌ మినిష్టర్‌గా ఉన్న నిర్మలా సీతారామన్‌కు కీలకమైన రక్షణశాఖను అప్పగించారు. వాణిజ్య శాఖ మంత్రిగా సమర్థంగా పనిచేసిన నిర్మల పనితీరును మెచ్చి.. ప్రధాని మోదీ ఆమెకు అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఇటీవల సరిహద్దుల్లో పాకిస్థాన్‌, చైనాతో సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో నిర్మలాసీతారామన్‌కు ఈ పదవిని అప్పగించడం విశేషం. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రక్షణశాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్‌ ఈ ఘనతను సొంతం చేసుకున్నారు.

సురేశ్‌ ప్రభుకు శాఖమార్పిడి
అటు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీశాఖల్లో మార్పులు చేయలేదు. ఎప్పటిలాగే రాజ్‌నాథ్‌కు హోంశాఖ, సుష్మాస్వరాజ్‌కు విదేశాంగశాఖ,అరుణ్‌జైట్లీ ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖలు నిర్వహిస్తారు. ఇక రోడ్‌రవాణా, షిప్పింగ్‌ శాఖా మంత్రి నితిన్‌గడ్కరీకి కొత్తగా జలవనరులు, గంగా డెవలప్‌మెంట్‌ బాధ్యతలు అప్పగించారు. కాగా ఉమాభారతిని తాగునీరు,శానిటేషన్‌ శాఖలకు మార్చారు. మరోవైపు వరుస రైలుప్రమాదాల నేపథ్యంలో.. సురేశ్‌ ప్రభుకు శాఖమార్పిడి జరిగింది. ఆయనకు వాణిజ్యం పరిశ్రమలశాఖను కేటాయించగా.. కీలకమైన రైల్వేశాఖ పీయూష్‌ గోయల్‌కు దక్కింది. తాజా విస్తరణలో పీయూష్‌ కేబినెట్‌ మంత్రిగా ప్రమోషన్‌ పొందారు. పెట్రోలియం, స్కిల్‌ డెవలప్‌మెంట్ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్‌, సమాచారశాఖ మంత్రిగా స్మృతి ఇరానీ బాధ్యతలు చేపట్టారు.

ముగ్గురికి స్వతంత్ర హోదా
ఇక కొత్తమంత్రుల్లో ముగ్గురికి స్వతంత్ర హోదా దక్కగా..మిగతా ఆరుగురు సహాయమంత్రులుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. స్వతంత్రహోదాలో హర్‌దీప్‌సింగ్‌ పూరి : పట్టణ గృహ నిర్మాణ వ్యవహారాలు, ఆల్ఫోన్స్‌ కన్నన్‌థానం : టూరిజం, ఎలక్ట్రానిక్స్‌ ,ఐటి ..రాజ్‌కుమార్‌ సింగ్‌ : విద్యుత్‌, పునర్వినియోగ శక్తివనరుల శాఖలు నిర్వహిస్తారు. సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో గజేంద్రసింగ్‌ షెకావత్‌ : వ్యవసాయం-రైతు వ్యవహారాలు, సత్యపాల్‌ సింగ్‌ : మావనవ వనరులు, గంగా అభివృద్ధి పథకం.. వీరేంద్ర కుమార్‌ : మహిళా-శిశుసంక్షేమం, మైనార్టీ వ్యవహారాలు...అశ్విని కుమార్‌ చౌదరి: ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం ..శివ్‌ప్రతాప్‌ శుక్లా : ఆర్థిక మంత్రిత్వశాఖ ,అనంతకుమార్‌ హెగ్డే : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలు నిర్వహిస్తారు. 

Don't Miss