టీఆర్‌ఎస్‌ లో అంతర్గత పోరు

17:30 - June 7, 2018

సంగారెడ్డి : గులాబీ పార్టీ నేతల్లో  అంతర్గతపోరు తారా స్థాయికి చేరుకుంటోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య   సమన్వయలోపం  పలు నియోజకవర్గాల్లో  సమస్యలు సృష్టిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో కొనసాగిన నేతలకు, కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన  నాయకులకు  మధ్య  చిటపటలు తీవ్రతరం అవుతున్నాయి. సంగారెడ్డిజిల్లా నారాయణఖేడ్‌లో గులాబీనేతల అంతర్గత విభేదాలు జిల్లా పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నాయి.   

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అధికార పార్టీ నేతలకు ఎమ్మెల్యేకు ఎక్కడా పొసగడం లేదు. పార్టీలో ఉద్యమనేతలు, కొత్త నేతలమధ్య కస్సుబుస్సుల పంచాయతీలు రక్తికడుతున్నాయి. నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వ్యవహారం అధికార పార్టీ నేతలను అయోమయానికి గురి చేస్తోంది. గతంలో  మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు 15 లక్షల రుపాయల లంచం పుచ్చుకున్నారన్న ఆరోపణలు కలకలం రేపాయి. దాంతోపాటు  ఎమ్మెల్యేగా ఎన్నికై  దాదాపు రెండేళ్లు అవుతున్నా.. నియోజకవర్గం నేతల మధ్య  సమన్వయం తీసుకురాలేకపోయారని భూపాల్‌రెడ్డిపై సొంతపార్టీ నేతలే విమర్శలకు దిగుతున్నారు. 

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ గ్రూపుల పోటాపోటీ రాజకీయలు రంజుగా మారాయి. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో విభేదిస్తున్న నేతలు ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కి మద్దుతుగా నిలుస్తున్నారు. ఎమ్మెల్సీ వర్గంగా గుర్తింపు పొందిన నేతలను ఏ అవకాశం ఉన్నా ఎమ్మెల్యేపై విమర్శలతో టార్గెట్‌ చేస్తున్నారు.    ఇటీవల  జరిగిన ఓ ఘటన నియోజకవర్గంలో మరింత కలకలం రేపింది.  ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ కంగ్ది  ఎంపీపీ రామారావ్   మండల సర్వసభ్య సమావేశంలోనే ఆత్మహత్యా యత్నానికి  ప్రయత్నించడం  అధికార పార్టీ నేతల్లో మరింత అయోమయం సృష్టిస్తోంది. 

ఎమ్మెల్యే వైఖరితో విసుగెత్తుతున్న నేతలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ రాములు నాయక్ శిబిరానికి వెళ్లి పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే  భూపాల్ రెడ్డిని తీరుమార్చుకోవాల్సిందిగా పార్టీ పెద్దలు వార్నింగ్‌ ఇచ్చినా పరిస్థితిలో మార్పురాలేదని గులాబీపార్టీ క్యాడర్‌ అంటోంది. 

Don't Miss