ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ఎమ్మెల్యే...

07:14 - January 23, 2018

రంగారెడ్డి : సంబంధం లేని కేసులో ఓ నిండు ప్రాణం బలైంది. తనపై లేనిపోని ఆరోపణలు చేయడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు.. పీఎస్‌లోనే పురుగుల మందు తాగాడు. ఎమ్మెల్యే సమక్షంలోనే ఇదంతా జరుగుతున్నా ఆయన కనీసం పట్టించుకోలేదు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా చూసీచూడనట్లుగా పలాయనం చిత్తగించాడు. దీంతో ఆస్పత్రికి తరలించేలోపు ఆ రైతు తుదిశ్వాస విడిచాడు. రైతు ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు ఆందోళన బాట పట్టారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఈదుల గోపాల్‌. గతేడాది అక్టోబర్‌ 11న శంకర్‌పల్లి పీఎస్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దశరద్‌ అనే వ్యక్తి మిస్సింగ్‌ కేసులో వికారాబాద్‌ జిల్లా నవ్‌పేట్‌ మండలం అక్నాపూర్‌కు చెందిన రైతు గోపాల్‌ను.. శంకర్‌పల్లి పీఎస్‌కు పోలీసులు విచారణకు పిలిపించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా పీఎస్‌కు వచ్చి ఈ కేసులో ఒత్తిడి తీసుకువచ్చారు తెచ్చారు. దీంతో పోలీసులు విచారిస్తున్న సమయంలో మనస్తాపానికి గురైన గోపాల్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే.. అక్కడే ఉన్న ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకుండా అక్కడినుంచి జారుకున్నాడు. పోలీసులు గోపాల్‌ను 108లో రంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా... ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు.

అయితే... అదృశ్యమైన దశరథ్‌.. గోపాల్‌ చనిపోయిన వారం రోజులకు ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న గోపాల్‌ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఎలాంటి సంబంధం లేని కేసులో గోపాల్‌ను ఇరికించి... ప్రాణాలు పోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపాల్‌ చావుకు కారణమైన శంకర్‌పల్లి పోలీసులు, ఎమ్మెల్యే యాదయ్య, దశరథ్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. మృతుడి బంధువుల ఆవేదనను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఈ కేసులో ఎమ్మెల్యే యాదయ్యకు సంబంధం ఉండడంతో పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సైబరాబాద్‌ కమిషనర్‌ను కలిసినా న్యాయం జరగడం లేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

ఎలాంటి తప్పు చేయని తన తండ్రిని.. శంకర్‌పల్లి పీఎస్‌కు తీసుకువచ్చి చిత్రహింసలకు గురి చేయడం వల్లే మృతి చెందాడని మృతుడి కుమారుడు చంద్రశేఖర్‌ అంటున్నాడు. ఎమ్మెల్యే యాదయ్య మధ్యవర్తిత్వం వహించి.. తన తండ్రి చావుకు కారణమయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన తండ్రి చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాడు. ఎలాంటి సంబంధం లేని కేసులో ఓ వ్యక్తి ప్రాణాలు పోయేందుకు కారణమైన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే... ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి..! 

Don't Miss