ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ప్రోగ్రెస్ రిపోర్ట్

19:49 - August 30, 2017

శ్రీకాకుళం : 2014 వరకు గృహిణిగా వున్నా, ఇప్పుడు పిలిస్తే పలికే లక్ష్మీదేవిగా ప్రజాభిమానం సంపాదించుకున్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరితోనూ కలివిడిగా వుండే లక్ష్మీదేవి ఎన్నికల హామీలు నెరవేర్చే విషయంలో ప్లస్ పాయింట్లు సాధించలేకపోతున్నారు. ఇవాళ్టి ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్టులో శ్రీకాకుళం నియోజకవర్గం పై ఓ లుక్కేద్దాం. 
మంచిపేరు తెచ్చుకున్న లక్ష్మీదేవి 
2014 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన టిడిపి ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అందరికీ అందుబాటులో వుంటారన్న మంచిపేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేయించిన సర్వేలలోనూ ఆమె టాప్ ర్యాంక్ సాధించడం విశేషం. నిజానికి 2014 వరకు గుండ లక్ష్మీదేవి గృహిణిగానే వుండేవారు. ఆమె భర్త గుండ అప్పల సూర్యనారాయణ 1985 నుంచి 1999 వరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ కేబినెట్ లో కొద్దికాలం మంత్రిగా సైతం పనిచేశారు. ముక్కుసూటి మనిషి, నిజాయితీపరుడన్న పేరు ప్రతిష్టలు సాధించారు. అయితే, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి  ధర్మాన ప్రసాదరావు విజయం సాధించి, పదేళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాతి పరిణామాల్లో వైసిపిలో చేరిన ధర్మాన గుండ లక్ష్మీదేవి చేతిలో ఓటమి చవిచూశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి గుండ లక్ష్మీదేవి నిత్యం కార్యకర్తలకు అందుబాటులో వుంటూ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిత్యం జనంలో వుంటూ ఎవరు పిలిచినా పలుకుతారన్న మంచి పేరు సంపాదించుకున్నారు లక్ష్మీదేవి. 
మైనస్ పాయింట్
వ్యక్తిగతగా ఎంత మంచిపేరు తెచ్చుకున్నా, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల నెరవేర్చే విషయంలో ఆమెకు ప్లస్ పాయింట్లు పడడం లేదు. శ్రీకాకుళంలో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, కోడి రామ్మూర్తి స్టేడియం పునర్ నిర్మాణం, నిరుపేద కుటుంబాలకు ఎన్టీఆర్ గృహాలు, అరసవిల్లి మాస్టర్ ప్లాన్, శ్రీకాకుళం మండలానికి రక్షిత మంచినీటి పథకం, గార మండలానికి ఎత్తిపోతల పథకం, బైరిదేశి గెడ్డ పనులు పూర్తి చేసి, చిట్టచివరి పొలాలకు సాగునీరందించడం లాంటి హామీలిచ్చారు. అయితే, ఇంకా కార్యరూపం దాల్చకపోవడం పెద్ద మైనస్ పాయింట్. అవుటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రతిపాదనల దగ్గరే ఆగిపోయాయి. కోడి రామ్మూర్తి స్టేడియం పునర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే రెండేళ్ల క్రితం శిలాఫలకం వేసినా, ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదు. ఏడాది క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించిన అల్లి చెరువు అభివృద్ధి పనులు కూడా ముందుకు సాగడం లేదు. గార మండలంలో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల నిధులు విడుదలైనా, ఇంకా టెండర్ల దశ దాటలేదు. ఇవన్నీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి మైనస్ పాయింట్లుగా మారుతున్నాయి.  
వివాదస్పదమైన వార్డుల విభజన 
కార్పొరేషన్ గా అవతరించిన శ్రీకాకుళం మేయర్ కుర్చీలో తన భర్తను కుర్చోపెట్టాలన్న ఆకాంక్షతో చేసిన వార్డుల విభజన వివాదస్పదమైంది. వార్డులు విభజించినతీరుపై ప్రతిపక్షాలే కాదు స్వపక్షీయులు సైతం విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో టిడిపి నాయకులు వ్యవహరిస్తున్నతీరు తనకు మేలు చేస్తాయన్న భావనతో వున్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. 
సామాజికవర్గాలు ప్రధానపాత్ర 
రెండు లక్షల 33 వేల మందికిపైగా ఓటర్లున్న శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజికవర్గాలు ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ నియోజకవర్గంలో వెలమ ఓటర్లు అధికం. రెండో స్థానంలో వైశ్యులు, మూడో స్థానంలో కాళింగ, నాలుగో స్థానంలో మత్స్యకారులు, ఐదో స్థానంలో శిష్ట కరణాలు వున్నారు. 1995లో ఈ నియోజకవర్గం ఏర్పడగా తొలి విజయం ఇండిపెండెంట్ ను వరించడం విశేషం. ఆ తర్వాత జనతాపార్టీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు ప్రాతినిథ్యం వహించారు. 1985 నుంచి టిడిపికి కంచుకోటగా మారింది శ్రీకాకుళం. 85, 89, 94, 99 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే భర్త అప్పల సూర్యనారాయణ వరుస విజయాలు సాధించారు. ఆ తర్వాత రెండుసార్లు ధర్మాన ప్రసాదరావును విజయం వరించింది. 2014 నుంచి ప్రాతనిథ్యం వహిస్తున్న లక్ష్మీదేవి 2019లోనూ విజయహాసం చేయాలంటే హామీలను నెరవేర్చడం మీద దృష్టిసారించాల్సి వుంటుంది. 

Don't Miss