మళ్లీ వార్తల్లో ఎమ్మెల్యే పుట్టా మధు...

18:36 - May 7, 2018

పెద్దపల్లి : జిల్లా మంథనిలో శివాలయం వేదికగా టీఆర్‌ఎస్‌లో రెండు వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తుమ్మిచెరువు ఆధునీకరణలో భాగంగా.. కట్టపై ఉన్న పురాతనమైన శివలింగం, నంది విగ్రహాలను తొలగించి మట్టిపోయడంతో వివాదం తలెత్తింది. అయితే ఈ పనిని ఎమ్మెల్యే పుట్టా మధు దగ్గర ఉండి చేయించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా మరోనేత సునీల్‌రెడ్డి ఆ విగ్రహాలపై మట్టిని తొలగించి పాలాభిషేకం చేశాడు. విషయం తెలుసుకున్న పుట్టా మధు గ్రామసభ నిర్వహించి.. సునీల్‌రెడ్డిపై ఫైర్‌ అయ్యాడు. సునీల్‌రెడ్డి వ్యక్తే కాదని ఆరోపించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికులు, బ్రాహ్మణులు సునీల్‌రెడ్డికి మద్దతుగా నిలవడంతో... పుట్టా మధు వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్రాహ్మణుల సంఖ్య ఎంత ? మీరు ఏం చేస్తారు ? అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో సీటు రాదనే ఉద్దేశంతోనే పుట్టా మధు ఇలా వివాదాలు సృష్టిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇద్దరి నేతల మధ్య విభేదాలు సరికాదని.. దీనిపై అధిష్టానం దృష్టి సారించాలని స్థానిక నేతలు కోరుతున్నారు. 

Don't Miss